28-05-2025 01:46:47 AM
-చర్యలు ఎప్పుడో మరి..!
-జోరుగా సాగుతున్నఅక్రమ రిజిస్ట్రేషన్ల దందా
కామారెడ్డి, మే 27,(విజయ క్రాంతి); అక్రమ రిజిస్ట్రేషన్ల దందాకు నిలయంగా కామారెడ్డి జిల్లాలోని పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. అవినీతి అక్రమాలకు అడ్డాగా కామారెడ్డి జిల్లా పాత తాలూకా కేంద్రం అయిన దోమకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అక్రమాలకు, అవినీతికి కేంద్రముగా నిలిచింది.
అన్ని పత్రాలు సక్రమంగా ఉండి రిజిస్ట్రేషన్ కోసం వెళ్తున్న సామాన్యులకు ఇబ్బందులు పెడుతున్న లేఖరులు విలేకరులు అంతా మేమే అంతా మా కనుసైగల్లో జరగాలి అంటూ హుకుం జారీ చేస్తూ సామాన్యులకు ఇబ్బందులకు గురిచేస్తున్న వైనం ఇది. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులు కూడా అక్రమార్కులకు మాత్రమే యదేచ్ఛగా వారు చెప్పిన విధంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారనీ సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
సామాన్య ప్రజలకు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లు మాత్రం వేగంగా చేస్తున్నారు. లేఖరులు విలేకరులు ఒకరే కావడం చేత అధికారులు సైతం నోరు మెదపక పోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
పంచాయతీ కార్యదర్శులతో చేతులు కలిపి ఇష్టానుసారంగా అసెస్మెంట్ నెంబర్లు జారీ చేస్తూ తప్పుడు డాక్యుమెంట్లు ద్వారా తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయిస్తూ ఒక్కో అసెస్మెంట్ నంబర్ కి జారీ చేసినందుకు లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ అతి తక్కువ సమయంలో అక్రమ ఆస్తులను కూడబెట్టుతూ లేఖర్లను చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
తక్కువ సమయంలోనే ఎక్కడపడితే అక్కడ ఇష్టానుసారంగా భూములు కబ్జా చేస్తూ తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకుని అవసరానుసారం లేఖరులు విలేకరుల ముసుగు ధరిస్తూ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని సామాన్యులకు ఇబ్బందులు గురి చేస్తున్నారనీ పాత తాలూకా కేంద్రం మైన దోమకొండ మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ రిజిస్ట్రేషన్ల కోసం ఒక్కో అసెస్మెంట్ నెంబర్ జారీకి రెండు లక్షల రూపాయలు చెల్లించినట్టు గతంలో ఎన్నో ఆరోపణలు ఉన్న విషయం విధితమే. ఇలా ఆలోచిస్తే పాత తాలూకా కేంద్రమైన దోమకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలో ఉన్న దోమకొండ, బిక్కనూరు, మాచారెడ్డి ,మండలాల్లో వందలాది అక్రమ అసెస్మెంట్ నెంబర్లు ఇచ్చి ఉంటారనీ వీటి వల్లనే కోట్లకు పడగ భావిస్తున్నారు.
ఒక ఇంటి ఓనర్ షిప్ పత్రం చూపించి ఓపెన్ ప్లేస్ రిజిస్ట్రేషన్ చేసిన ఘనత దోమకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయం కే చెందుతుంది. ఇలాంటివి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తూ ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు పనిచేస్తున్నారు.
అసెస్మెంట్ నెంబర్ల జారి పై ఆరా బిక్కనూరు పంచాయితీలో అనిశా వివరాల సేకరణ
ప్రభుత్వ శాఖల్లో అవినీతి అరికట్టేందుకు అనిశా (అవినీతి నిరోధక శాఖ) దాడులను నిర్వహిస్తోంది గతానికి భిన్నంగా ఏదేని శాఖ లేదా కార్యాలయంలో అవినీతి జరిగినట్లు వస్తున్న ఆరోపణలు పై ఆ శాఖ యంత్రాంగం వివరాలు సేకరిస్తుంది.
దళారులు ఇసుకసురుల అవతారమెత్తి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణల నేపథ్యంలో ఇటీవల బిచ్కుంద టానాలో తనిఖీలు నిర్వహించారు బిచ్కుంద గ్రామపంచాయతీలో అసెస్మెంట్ నెంబర్ల జారిపై సమగ్ర వివరాలు వెల్లడించాలని కోరుతూ మండల, డివిజన్ పంచాయతీ అధికారుల అవినీతిపై అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తుంది.
గ్రామస్థాయిలోనే అవినీతి
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో అసెస్మెంట్ నెంబర్ల జారిపై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. తన లాగిన్ దుర్వినియోగం చేసి తనకు తెలియకుండానే అసెస్మెంట్ నెంబర్లు జారీ చేశారని గతంలో విధులు నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి స్థానిక స్థానాల్లో ఫిర్యాదు చేశారు.
ఖాళీ స్థలాలకు అసెస్మెంట్ నెంబర్లతో పాటు ఇంటి నెంబర్లు జారీ చేసినట్లు ఆరోపాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో అనీషా అధికారులు సమగ్ర వివరాలు తెలియజేయాలని కోరుతూ పంచాయతీ అధికారులకు లేఖ రాసినట్లు సమాచారం. ఈ విషయాన్ని పంచాయతీ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు లేక స్పందించిన పంచాయతీ అధికారులు వివరాలు వెల్లడిస్తూ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది జిల్లావ్యాప్తంగా మేజర్ పంచాయతీలు పాటు మండలం కేంద్రంలో అసెస్మెంట్ నెంబర్ల జారీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. వీటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
పలు శాఖలలో అవినీతి పై వెల్లు వెత్తుతున్న ఆరోపణలు
కామారెడ్డి జిల్లాలోని పలు శాఖల కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పంచాయతీ కార్యదర్శుల నుంచి తనిఖీలు పేరిట కొందరు అధికారులు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖలో సైతం మండల అధికారుల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వెలువెత్తిన విషయం తెలిసిందే.
నిజామాబాద్ జిల్లాలో సైతం
నిజామాబాద్ జిల్లాలో సైతం ఇటీవల ఓ కార్యాలయంలో పెద్దఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఒకేరోజు నాన్ లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిబంధనలకు విరుద్ధంగా పూర్తి చేసినట్లు సమాచారం. నిషేధిత జాబితాలో ఉన్న.. ఇండస్ట్రియల్, అసైన్డ్ భూములకు సంబంధించి లింకులు ఉండడంతో దర్జాగా లావాదేవీలు పూర్తి చేసినట్లు సమాచారం. అలాగే నాలా లేని భూములను సైతం రిజిస్ట్రేషన్ చేసి పెట్టారని తెలుస్తోంది. కాగా.. ఈ వ్యవహారం ఇంకా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లలేదు.
లంచం తీసుకుంటూ దొరికిన సబ్ రిజిస్ట్రార్
ఖమ్మ జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రార్ ఆఫీసులో పని చేసే సబ్‌రిజిస్ట్రార్ అరుణ లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి చిక్కింది. ఖమ్మం మండలానికి చెందిన ఓ వ్యక్తి తన రెండు ఎకరాల భూమిని కుమారుడి పేరిట గిఫ్ట్ డీడ్ చేయాలనుకున్నాడు. అందుకు సబ్ రిజిస్ట్రార్ అరుణ రూ.50 వేల లంచం డిమాండ్ చేసింది.
చివరకు రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది. ఇలాంటి ఘటనలు ఇటీవల పలు జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సైతం ఎసిబి అధికారులు రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.
అవినీతిపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
అవినీతిపై బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి.1064 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించినా చర్యలు తీసుకుంటాం. వాట్సాప్ నంబర్ (944044 6106) ను వినియోగించుకోవాలి. ఫిర్యాదు దార్ల వివరాలను గోప్యంగా ఉంచుతాం.
శేఖర్ గౌడ్, ఏసీబీ, డి.ఎస్.పి నిజామాబాద్