calender_icon.png 29 May, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు ముగ్గురు కొత్త జడ్జీలు

28-05-2025 01:52:59 AM

  1. జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ సుమలత, జస్టిస్ లలిత కన్నెగంటి, ఏపీకి ఒకరు
  2. సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు
  3. ఐదు హైకోర్టులకు కొత్త సీజేలు
  4. కోల్‌కతా హైకోర్టుకు సుజయ్‌పాల్
  5. కొలీజియం కీలక సిఫార్సులు

న్యూఢిల్లీ, మే 27: దేశంలోని 11 హైకోర్టులలో పనిచేస్తున్న 21 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసింది. దీంతో పాటు సుప్రీంకోర్టుకు సైతం ముగ్గురు కొత్త న్యాయమూర్తుల పేర్లను ప్రతిపాదించింది. బదిలీల్లో భాగంగా తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు రానున్నారు.

పట్నా హైకోర్టులో విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ అభిషేక్‌రెడ్డి, కర్ణాటక హైకోర్టులో పనిచేస్తున్న జస్టిస్ సుమలత, జస్టిస్ లలిత కన్నెగంటి తెలంగాణ హైకోర్టుకు బదిలీపై పంపాలని కొలీజియం సిఫార్సు చేసింది. మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని సూచించింది. కాగా తెలంగాణ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్‌ను కోల్‌కతా హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించారు.

దీంతో పాటు ఐదు హైకోర్టులకు కొత్త సీజేల పేర్లను సిఫార్సు చేశారు. భారత అత్యున్నత న్యాయస్థానానికి సీజేఐగా బీఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సమావేశమైన కొలీజియం.. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ అంజారియా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విజయ్ బిష్ణోయ్, బాంబై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్ పేర్లను సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసింది.

ప్రస్తుతం సుప్రీంకోర్టులో 31 మంది న్యాయమూర్తులు సేవలందిస్తుండగా ఈ ముగ్గురి చేరికతో సంఖ్య 34కు చేరుతుంది. కొలీజియం సిఫార్సులకు కేంద్రప్రభుత్వం ఆమోదం లభించిన అనంతరం, రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు నియామకాలను అనుమతి లభిస్తోంది.

ఈ హైకోర్టులకు కొత్త సీజేలు

మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ సంజీవ్ సచ్‌దేవాను అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సూచించింది. పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ అశుతోష్ కుమార్‌ను గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేసింది.

ట్నా హైకోర్టులోని మరో జడ్జి విఫుల్ మనూభాయ్ పంచోలీని అదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సూచించింది. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ విభు భఖ్రూను కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేసింది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లోక్ సింగ్ చౌహాన్‌ను ఝార్ఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ప్రతిపాదించింది.