28-05-2025 01:27:33 AM
-జోరుగా ఇసుక అక్రమ రవాణా
-అనుమతుల్లేకుండా తరలింపు
-ప్రభుత్వ ఆదాయానికి అక్రమార్కుల గండి
-పట్టించుకోని అధికార యంత్రాంగం
నాగార్జునసాగర్, మే 27 : నాగార్జునసాగర్ నియోజకవర్గ అనుముల మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలించుకుపోతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
దీంతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా యదేచ్చగా ఇసుకు రవాణా జరుగుతుంది. ఇసుక అక్రమ రవాణాను అరికడతామని చెబుతున్న అధికారులు దీనిని నిరోధించడానికి దృష్టి సారించడం లేదని పలువురు చెబుతున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ అనుముల మండలం లో ప్రభుత్వం మైనింగ్ శాఖ అధికారులు ఒకే మండలంలో 4 రీచ్లను ఏర్పాటు చేశారు.
వాటిలో పులిమామిడి, చింతగూడెం, పాలెం,రామడుగు గ్రామాలలో ఇసుక రీచ్ల ఏర్పాటు చేసి కావలసిన వారికి ట్రాక్టర్ల సాయంతో తరలించడం జరుగుతుంది. ఇక్కడ కొంత మంది అక్రామర్జనే ద్యేయంగా అలవాటు పడిన కొందరు పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక రవాణా చేస్తూన్నారు.
మండలంలోని అనుముల, పాలెం, రామడుగు, పులిమామిడి ప్రాంతాల్లో ఇసుక రీచ్లు గ్రామానికి దగ్గరగా ఉండటంతో అక్రమార్కులకు పగలు రాత్రి తేడా లేకుండా రిచ్ల నుంచి ఇసుక తరలిస్తున్నారు. ఫిర్యాదులు చేసినా ఫలితం మాత్రం శూన్యమనే చెప్పాలి.
అధికారుల కుమ్మక్కు..
అక్రమ ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లపై ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యమనే చెప్పాలి. అక్రమ ఇసుక ట్రాక్టర్లను కట్టడి చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నడం గమనార్హం.
మండలంలో ఉన్న నాలుగు రీచ్లో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతున్నట్లు అధికారులకు ఫిర్యాదు చేసిన వారిలో ఎటువంటి చలనం లేదంటూ ఫిర్యాదు చేసినా కొందరు బహిరంగంగానే వాపోతున్నారు. పోలీస్ రెవిన్యూ మైనింగ్ అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తుండడం గమనార్హం.
మండలంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు మండల తహశీల్దార్, స్థానిక ఎస్త్స్రకు చరవాణి ద్వారా ఫిర్యాదులు వచ్చిన వారు సకాలంలో స్పందించడం లేదని పిర్యాదులు చేసిన కొందరు వాపోతున్నారు.వారికి ఫిర్యాదు చేసిన ఎటువంటి ప్రయోజనం లేదని వారు అంటున్నారు.
ఇసుక డంపుల ఫోటోలు పెట్టిన అటువైపుగా తెలుసుకునే ప్రయత్నం కూడా చెయరని తెలుస్తుంది. గతంలో ఇక్కడ పనిచేసిన కొందరు అధికారులు అక్రమ ఇసుక, భూతగాదాలతో బదిలీ కావడంతో ప్రస్తుతం ఉన్న అధికారులు అక్రమ ఇసుక వైపు వెళ్లడం లేదనే విమర్శలు లేకపోలేదు. మాకు ఎందుకు తలకాయ నొప్పి అనే విధంగా దాంట్లో తలదూర్చడం లేదంటూ మరికొందరి వాదన.
ప్రభుత్వ ఖజానాకు గండి..
ఈ అక్రమ ఇసుక రవాణా తో ప్రభుత్వం ఆదాయానికి గండి పడుతోంది. అంతేకాకుండా రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో అధికారులు కూడా తమకు ఎందుకులే అన్న చందంగా వ్యవహరిస్తూ తమ వాటా తమకు వస్తే చాలు కదా అనే ఒక ఉదాసీనత వైఖరితో వ్యవహరిస్తున్నట్టు సమాచారం.
రాజకీయనాయకుల, ప్రజా ప్రతినిధుల నిర్ణయాలను కాదని తాము ఇసుక కట్టడి చేస్తే తమకు బదిలీ తప్పదని బెంగతో కొందరు అధికారులు కిమ్మనకండా ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి.ఆయా ప్రాంతాల్లో కూలీల ద్వారా మరికొన్ని ప్రాంతాల్లో జెసిబి ల ద్వారా ట్రాక్టర్లు నింపి ఆయా మండలాలకు రవాణా చేస్తూ అక్రమార్జ నకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు
ఇసుక అక్రమ రవాణాకు అధికారులే తెరలేపుతున్నారెమోనని గ్రామాల్లో పలువురు ఆరోపణలు చేస్తున్నారు. వాగులో ఇసుకాసురులకు ఒక వరంగా మారిందని, పట్టపగలే ఇసుకను ఇష్టారాజ్యంగా తరలిస్తుండడం గమనార్హం. అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా వల్ల భూగర్భ జలాలు ఆడుగంట్టుతున్నాయని చుట్టుపక్కల రైతులు వాపోతున్నారు.
సంబంధిత రెవెన్యూ, మైనింగ్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగా మారిపోయిందని వాగులో పరిసరాల ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ, మైనింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో అక్రమార్కులు అదే అదునుగా ఇసుక రవాణా జోరుగా కొనసాగిస్తున్నారు.