30-01-2026 01:21:09 AM
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
రేగొండ,జనవరి 29(విజయక్రాంతి): సమ్మక్క - సారలమ్మ తల్లుల చల్లని దీవెనలు, ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈమేరకు ఆయన గురువారం సాయంత్రం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివార్లలో ప్రకృతి ఒడిలో జరుగుతున్న మినీ మేడారం సమ్మక్క - సారలమ్మ తల్లులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనదేవతలను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, కోరిన కోరికలు తీరుస్తూ ప్రజల కష్టాలను నెరవేరుస్తున్న గిరిజన ఆదివాసీ దైవం సమ్మక్క - సారలమ్మ అని అన్నారు.
మునుపెన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో జరిగే అన్ని మినీ మేడారం సమ్మక్క - సారలమ్మ జాతరలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలకు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దర్శనం కంటే ముందు ఎమ్మెల్యే జీఎస్సార్ జాతర లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మల విజేందర్, గ్రామ సర్పంచ్ చల్లగూరుగుల సుదర్శన్,గ్రామ ఉప సర్పంచ్ ఆకుతోట తిరుపతి, కాంగ్రెస్ నాయకులు గంగుల రమణారెడ్డి, పల్నాటి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.