01-05-2025 08:15:04 PM
అశ్వాపురం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో గురువారం మే డే 139వ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. మే డే స్ఫూర్తితో హక్కులు నిలబెట్టుకోవడం కోసం అదనపు సౌకర్యాల కోసం మరింత ఉధృతంగా ఐక్య పోరాటాలు చేయడమే మన ముందున్న కర్తవ్యం అన్నారు. ఒక కార్మికవర్గ పార్టీగా సిపిఐ పార్టీ కార్మిక హక్కుల కోసం నిలబడుతుందన్నారు. భారతదేశ కార్మికులు రానున్న కాలంలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు. భారత రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కులు ప్రజాస్వామ్యం లౌకికతత్వం స్ఫూర్తి దెబ్బతిస్తుంది అన్నారు.
ప్రధానంగా రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు పని హక్కు సమిష్టి తత్వం నీరుగారుస్తుందని, మత సామరస్యాన్ని దెబ్బతీసి కార్మిక వర్గంలో చీలికలు తీసుకువచ్చి ,పెట్టుబడిదారులకు ప్రయోజనం కలిగిస్తుందని, ఈ నేపథ్యంలో మేడే సందర్భంగా పలు అంశాలను పరిశీలించాలని అన్నారు. రానున్న రోజుల్లో కార్మిక వర్గం, రైతాంగం మేడే స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని కమటం పిలుపు నిచ్చారు .ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కొల్లు ఆశ, సర్వ కృష్ణ, చుంచు ఇరాలు, దండి నగేష్, తిప్పారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కళ్యాణ్, నాగులు మీరా, కొమరయ్య, శ్రీను, రాము, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.