23-05-2025 12:00:00 AM
‘ఎప్పుడూ మీరే మాట్లాడాలా? అప్పుడప్పుడు.. కనీసం కడుపు మండినప్పు డైనా నన్ను నోరు విప్పనివ్వండి. నేను మాట్లాడటం మొదలుపెడితే కొన్ని సందర్భాల్లో ఎదుటివారు చెవులు మూసుకోవాల్సి రావచ్చు. కనీసం అప్పుడైనా వాళ్ల నోళ్లకు మూతలు పడతాయని నేను నమ్ముతా’ అంటూ రుసరుసలాడింది అనన్య పాండే. ఈ బాలీవుడ్ బ్యూటీ జఘన సౌందర్యానికి శస్త్ర చికిత్స చేయించుకుందంటూ ఇటీవల బాలీవుడ్‌లో వార్తలు వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలోనే స్పందించిన అనన్య.. తన కెరీర్ ప్రారంభంలో విన్న మాటలు ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయని పేర్కొంది. “నీకూ స్మార్ట్ టీవీ స్క్రీన్‌కూ పెద్ద తేడా లేదు.. నీ కాళ్లేంటి? కోడి కాళ్లలాగా అంత సన్నగా ఉన్నాయి.. అసలు నువ్వెంత బక్కగా ఉన్నావో చూసుకున్నావా?, మనిషన్నాక కాసింత కండ ఉండాలి.. మరి నువ్వేంటి మరీ అగ్గిపుల్లలా ఉన్నావ్?’ అంటూ చేసిన కామెంట్స్ వినీవినీ విసుగొచ్చింది.
ఇంకా 18 ఏళ్లయినా నిండక ముందే ఇండస్ట్రీకి వచ్చాను. అప్పుడు నేను సన్నగానే ఉండేదాన్ని. మహిళల శరీర సౌష్ఠవాన్ని వర్ణించినంతగా, మగవాళ్ల గురించి మాట్లాడదు ఈ సమాజం. పురుషాధిక్య పరిశ్రమను తట్టుకోవడం అంత సులువు కాదు. ఇటీవల జఘన సౌందర్యానికి శస్త్ర చికిత్స చేయించుకున్నానని ప్రచారం చేస్తున్నారు. నేను అలాంటివేమీ చేయించుకోలేదు..
వయసు పెరుగుతున్నకొద్దీ శరీరంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాస్త నిండుగా కనిపిస్తున్నానంతే. అంత మాత్రానికే నోటికి వచ్చినట్టు మాట్లాతున్నారు. అలాంటివారిని చూస్తుంటే ఏవగింపుగా ఉంది” అని రాసుకొచ్చారు.