calender_icon.png 30 December, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీడియా పాయింట్

30-12-2025 12:36:48 AM

చర్చకు భయపడే కేసీఆర్ పలాయనం: విప్ బీర్ల ఐలయ్య

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 29 (విజయక్రాంతి): పదేండ్లు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన కేసీఆర్, రెండేళ్లుగా అసెంబ్లీ ముఖం చూడలేదని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. ఇవాళ కేవలం తన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి, డిస్క్వాలిఫై కాకుండా ఉండటానికి మొక్కుబడిగా వచ్చి సంతకం పెట్టి వెళ్లారని ఎద్దేవాచేశారు. కృష్ణా నీటి వాటాలపై, ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు- -రంగారెడ్డి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరగాల్సి ఉన్నదని, గతంలో కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కేసీఆర్ సంతకం పెట్టి మరీ తాకట్టు పెట్టారని ఆరోపించారు.

ఆ దోపిడీపై చర్చకు వస్తే సమాధానం చెప్పలేకనే పారిపోయారని విమర్శించారు. వారి పదేండ్ల పాలనకు, మా రెండేళ్ల ప్రజా పాలనకు తేడా చూపిస్తామన్నారు. మీరు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కేటీఆర్ తండ్రి చాటు బిడ్డగా ఎదిగారు తప్ప స్వశక్తితో కాదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో మహిళలకు ఆత్మగౌరవం పెరిగిందని చెప్పారు.

కుటుంబ గొడవలకు సభను వేదిక చేయొద్దు: విప్ ఆది శ్రీనివాస్

కేసీఆర్ వస్తున్నారని ఉదయం నుంచి బీఆర్‌ఎస్ నేతలు హడావిడి చేశారని, తీరా చూస్తే ఆయన వచ్చి, సంతకం పెట్టి, నిమిషాల వ్యవధిలో వెళ్లిపోయారని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కనీసం చనిపోయిన మాజీ సభ్యులకు సంతాపం ప్రకటించడానికి కూడా ఆయనకు మనసు రాలేదని ధ్వజమెత్తారు.

ఇది సభను, తోటి సభ్యులను అవమానించడమేనని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా సభలో ఉండి ప్రజా సమస్యలపై, కృష్ణా జలాల నష్టంపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత కేసీర్‌పై ఉన్నదన్నారు. అసెంబ్లీని కేసీఆర్, హరీశ్‌రావు గొడవలకు, రాజకీయ డ్రామాలకు వేదికగా మార్చుకోవద్దని హితవుపలికారు.

ప్రాజెక్టుల పాపం బీఆర్‌ఎస్‌దేనని ఆగ్రహించారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు జీవో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, కానీ బీఆర్‌ఎస్ వచ్చాక ప్రాజెక్టు వ్యయాన్ని అమాంతం పెంచి, రీ-డిజైన్ పేరుతో కాలయాపన చేసి ప్రాజెక్టును పక్కన పెట్టిందని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదిక బయటకు వస్తే ఎక్కడ తమ తప్పులు బట్టబయలు అవుతాయో అన్న భయంతోనే కేసీఆర్, కేటీఆర్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టింది వారేనని గుర్తుచేశారు. గత ప్రభుత్వం రైతులను మోసం చేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రుణమాఫీ చేసి చిత్తశుద్ధి చాటుకుందన్నారు. 

రేవంత్, కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్: బీజేఎల్పీ నేత ఏలేటి

రేవంత్, కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ బట్టబయలయిందని, అందేకే చర్యలు తీసుకోవడంలేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, రేవంత్‌రెడ్డి మిత్రులుగా మారిపోయారన్నారు. వారి మధ్య స్పష్టమైన మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నదని విమర్శించారు. అందుకే కాళేశ్వరం సహా ఇతర కుంభకోణాలపై విచారణలు నత్తనడకన సాగుతున్నాయన్నారు. గ్లోబల్ సమ్మిట్‌పై వైట్ పేపర్ విడుదల చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు. మహిళలకు, నిరుద్యోగుల కు, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. రెండు మూడు రోజుల్లో సభను ముగించాలని చూడటం పారిపోవడమేనని, ప్రజా సమస్యలను తాము సభలో కచ్చితంగా లేవనెత్తుతామని స్పష్టంచేశారు.

ఖాళీలు భర్తీ చేయండి: ఎమ్మెల్సీ అంజిరెడ్డి

ఉద్యోగుల గోస వినాలని, ఖాళీలను భర్తీ చేయాలని ఎమ్మెల్సీ సీ అంజిరెడ్డి డిమాండ్‌చేశారు. ఉద్యోగుల డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, పీఆర్సీపై స్పష్టత లేదని పేర్కొన్నారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల్లో 70 శాతం టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నదన్నారు. బహుళ అంతస్తులకు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తున్నారని, అక్కడ ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. పటాన్‌చెరు రెవెన్యూ డివిజన్ హామీని అమలు చేయాలని కోరారు.

ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీ ఏమైంది: మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్

ముదిరాజ్ కులస్తులను బీసీ-డీ నుంచి బీసీ- ఏ గ్రూపులోకి మార్చాలని చాలా కాలంగా డిమాండ్ ఉన్నదని, కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ హామీని స్పష్టంగా ఇచ్చిందని మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ గుర్తుచేశారు. కానీ నేటికీ అది నెరవేరలేదన్నారు. రాష్ట్రంలో బీసీ కులగణన పూర్తయిందని, ఆ డేటా ఆధారంగా, బీసీ కమిషన్ నుంచి వెంట నే నివేదిక తెప్పించుకుని ముదిరాజ్‌ను బీసీ- ఏ జాబితాలో చేర్చి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు.

గల్ఫ్ కార్మికుల భద్రతకు చర్యలు తీసుకోవాలి: తీన్మార్ మల్లన్న

గల్ఫ్ కార్మికుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం చ ర్యలు తీసుకోవాలని ఎ మ్మెల్సీ తీన్మార్ మల్లన్న విజ్ఞప్తిచేశారు. గల్ఫ్‌లో చనిపోతున్న కార్మికుల డెడ్ బా డీలు స్వదేశానికి తెచ్చేందుకు రోజులు పడుతు న్నాయని పేర్కొన్నారు. కా ర్మికుల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలను ఇక్కడ అమలు చే యాలని కోరారు. యూనివర్సిటీల్లో 2,717 పోస్టులకు 1,120 పోస్టులు ఖాళీలున్నాయని, వాటిని భర్తీ చేయాలని కోరారు.

సైబర్ క్రైం పెరుగుతోంది: ఎమ్మెల్సీ భానుప్రసాద్

రాష్ట్రంలో సైబర్ నేరాలు అధికంగా పెరుగుతున్నాయని, వాటిని కట్టడి చేయాల్సి ఉందని ఎమ్మెల్సీ భానుప్రసాద్ తెలిపారు. బాధితుల్లో పోలీసులు కూడా ఉంటున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో సీరియస్‌గా ఉండాలని కోరారు. దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. దివంగత ప్రజాకవి అందెశ్రీకి మండలిలో సంతాపం తెలిపేందుకు అనుమతినివ్వాలని కోరారు. ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, నవీన్‌కుమార్, వాణీదేవి, భస్వరాజ్ సారయ్య, మధుసూదనాచారి పలు అంశాలపై మాట్లాడారు.

ట్రిపుల్ ఆర్ బాధితులకు పరిహారం ఇవ్వాలి: నెల్లికంటి 

ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ విలువకు అనుగుణంగా నష్టప రిహారం ఇవ్వాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విజ్ఞప్తి చేశారు. ఫార్మా కంపెనీల ప్రయోజనాల కోసం ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చడం సరికాదన్నారు.

వర్సిటీల్లోని ఖాళీలు భర్తీ చేయాలి: అంజిరెడ్డి

యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలు 70 శాతం వరకు ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్సీ సీ అంజిరెడ్డి తెలిపారు. ఉస్మానియా వర్సిటీకు ఇచ్చినట్టుగానే మిగిలిన 11 వర్సిటీలకు కూడా నిధులు విడుదల చేయాలని కోరారు. ఉద్యోగుల డీఏలు పెండింగ్ ఉన్నాయని, పీఆర్సీ గురించి స్పష్టత లేదన్నారు. బహుళ అంతస్తులకు అనుమతులు ఇస్తున్నారు కానీ, అక్కడ అనుకోని సంఘటనలు జరిగితే బాధ్యులు ఎవరు అని ప్రశ్నించారు.