19-08-2025 12:00:00 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో ఆగస్టు 18 (విజయక్రాంతి): సమాజంలో ప్రత్యేక అవసరాలు గల వారికి నాణ్యమైన వైద్యాన్ని అందించడంలో ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్ల సమిష్టి కృషి ఎంతో కీలకమని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. సోమవారం రాజ్ భవన్లోని ‘సంస్కృతి’ కమ్యూనిటీ హాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత మెగా సర్జికల్ కరెక్షన్, హెల్త్ క్యాంప్ను ఆయన ప్రారంభించారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో డిసేబుల్ ఫౌండేషన్ ట్రస్ట్, డా. నారి ఛారిటబుల్ ట్రస్ట్, అగర్వాల్ సేవా దళ్, రవి హీలియోస్ హాస్పిటల్, పిట్టి ట్రస్ట్ వంటి పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ శిబిరాన్ని సంయుక్తంగా నిర్వహించారు. రాజ్ భవన్ కూడా దివ్యాంగుల సేవలో ముందుందని, ఈ ఏడాది నుంచి ‘గవర్నర్స్ ఎక్సలెన్స్ అవార్డుల’లో దివ్యాంగులకు ప్రత్యేక కేటగిరీని ప్రవేశపెట్టామని తెలిపారు.
ఈ అవార్డులు అందుకున్న పారాలింపిక్ పతక విజేత జీవన్జీ దీప్తి, ఆదిత్య మెహతా ఫౌండేషన్ వంటి వారిని ఆయన అభినందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. దివ్యాంగులైన ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను, ముఖ్యంగా కారుణ్య బదిలీల వంటి డిమాండ్లను ప్రభుత్వం తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన పథకాలను చురుకుగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ‘తెలంగాణ వ్యాప్తంగా దివ్యాంగులకు అడ్డంకులు లేని, సమగ్ర, సాధికారతతో కూడిన వాతావరణాన్ని నిర్మించడమే మా ప్రభుత్వ లక్ష్యం, అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, గవర్నర్ సంయుక్త కార్యదర్శి జె. భవాని శంకర్, రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వీరయ్య, ఐఆర్సీఎస్ తెలంగాణ సీఈవో శ్రీరాములు, ఐఆర్సీఎస్ హైదరాబాద్ చైర్మ న్ భీమ్ రెడ్డి, అగర్వాల్ సేవాదళ్కు చెందిన శరద్ పిట్టి అగర్వాల్, డా.నారి ఫౌం డేషన్కు చెందిన డా. కీర్తన పాల్గొన్నారు.