15-08-2024 12:00:00 AM
విశ్వ గురువుగా పునర్ వైభవంతో కరోనా నిశీధిని సమాధి చేసి నింగికెగిసే కాంతిజ్వాలల వ్యాక్సిన్ వెలుగులో మన దేశమే వేదికగా జగతి గర్వించే వేడుకగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ మహోదయంగా మారింది. ఆనాటి స్వాతంత్య్ర సమరస్ఫూర్తి చరితను కదిలిస్తుంటే స్వేచ్ఛ సమానత్వపు జాడలను స్పర్శిస్తుంటే దిక్కులన్నీ దద్దరిల్లేలా యావత్ భారతజాతి గర్వపడేలా ఇంకా వినబడుతూనే వున్నాయి. సజీవ సాక్ష్యాలై కనబడుతూనే వున్నాయి. గర్జించిన లక్ష్యాల గళాలు పోరాడిన లక్షల ప్రాణాలు వీరనారి ఝాన్సీ తిరుగుబాటు క్షణాలు దేశమే ముఖ్యమన్న అంబేద్కర్ ఆశయాలు రవీంద్రుని గీతాంజలి స్వప్నాలు వివేకానందుని దేశభక్తి వచనాలు నేడు ఎన్నో ఉద్యమాలకు అహింస అమృతంతో ఊపిరిపోస్తూనే వున్నాయి.
నెహ్రూ శాంతికపోతమై జాతి సమగ్రతను బోధిస్తున్నాయి. జైహింద్ నినాదపు నేతాజీ హృదయ వికాసం ఇంక్విలాబ్ జిందాబాద్ భగత్‌సింగ్ అమర త్యాగం వందేమాతరపు ఐకమత్యపు ప్రభంజనం క్విట్ ఇండియాగా గాంధీజీ సంచలనం స్వరాజ్య సాధనలో ఆదర్శమై నిలిచి గెలిచిన సత్యాగ్రహం ఇలా రాస్తున్న నా కలం కాలాన్ని శోధిస్తుంటే కేవలం బానిసత్వంపై చేసిన యుద్ధం కాదు స్వాతంత్య్రమంటే. ధర్మంపై ఏనాడు అధర్మం గెలవదని ఆనాడే చెప్పిన కురుక్షేత్ర సంగ్రామపు శ్రీకృష్ణుడి గీతా సారాంశమే నా దేశపు స్వాతంత్య్ర స్ఫూర్తి సందేశమంటే. యుగాలు మారి తత్వాల ఆలోచనలన్నీ అస్తమించిన నా దేశపు కీర్తి అజరామరం. మా స్వాతంత్య్ర స్ఫూర్తి అనితర సాధ్యం.
ఎరుపు తెలుపు ఆకుపచ్చ రంగుల
గంగాజలాల సంగమమే నా మతం.
త్రివర్ణ పతాకపు మానవత్వమే
వేల సంవత్సరాలుగా
మేము చెబుతున్న పాఠం.
భారతీయుని శాస్త్రీయత అనంత
విశ్వంలోకి దూసుకెళ్తున్న వేళ
ఐక్యరాజ్యసమితి
శిఖరాగ్ర సమావేశంలో
అఖండ భారతావని సాక్షిగా
గట్టిగా చెప్పాలని వుంది
వందే మాతరం!
మేరా భారత్ మహాన్!!
ఫిజిక్స్ అరుణ్ కుమార్
9394749536