calender_icon.png 14 September, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువ భారతం సమస్యలు

15-08-2024 12:00:00 AM

దేశం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో కేంద్ర గణాంకాల శాఖ ఓ ఆసక్తికరమైన నివేదిక వెలువరించింది. ‘ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023’ పేరుతో కూడిన ఆ నివేదిక ప్రకారం 2036 నాటికి దేశ జనాభా 152.2 కోట్లకు చేరుకుంటుంది. అదే సమయంలో పురుషులతో పోలిస్తే మహిళల నిష్పత్తి కాస్త పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అన్నిటికన్నా ముఖ్యంగా పని చేసే వయసున్న వారి జనాభా ఇప్పటికంటే మరింత పెరుగుతుందని అంచనా వేసింది. 15 ఏళ్ల వయసు వారి జనాభా 2011లో 60.1 శాతం ఉండగా, 2036 నాటికి అది 64.9 శాతానికి చేరుకోగలదని వెల్లడించింది. అంటే, 152 కోట్ల జనాభాలో పని చేయగల శక్తి ఉండేవారు 95 కోట్ల మందికి పైగా ఉంటారు.

వీరందరికీ ఉపాధి కల్పించడం ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారగలదు. ఐటీ, ఇంజినీరింగ్ తదితర రంగాల్లో ఉత్తీర్ణులై కోటి కోర్కెలతో కళాశాలల నుంచి బైటికి వచ్చే లక్షలాది యువత ఆశలు, ఆకాంక్షలు చాలానే ఉంటాయి. చదువుకు తగ్గ ఉద్యోగం, వేతనం, గౌరవప్రదమైన జీవితం ఇలా ఎన్నో కోర్కెలతో ఇంటర్వ్యూల కోసం కంపెనీల మెట్లెక్కినప్పుడు కానీ వారికి అసలు పరిస్థితులు అర్థం కావడం లేదు. ప్రతి లక్షమంది గ్రాడ్యుయేట్లలో కొన్ని వేలమందికి మాత్రమే ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని, మిగతా వారంతా దొరికిన చిన్నపాటి ఉద్యోగాలతో సర్దుకు పోవాలని, లేకపోతే నిరుద్యోగులుగానే ఉండి పోవలసి వస్తుందని తెలియడంతో వారి కలలన్నీ కల్లలవుతున్నాయి.

అలా సర్దుకోలేక లక్షలు, కోట్లు అప్పులు చేసి వీసాలు సంపాదించి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి విదేశాలకు వెళ్లినా అక్కడా ఇదే పరిస్థితి ఎదురవుతున్నది. ఏ కొద్దిమందో ఆశించిన ఉద్యోగాలు పొందగలుగుతున్నారు. ఇటీవల మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారి సంఖ్య బాగా పెరిగిందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఇదొక రకంగా ‘మేధోవలస’. ఏ దేశానికైనా ముఖ్యంగా మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి ఇది ఎంతమాత్రం మంచిది కాదు. దేశంలోని 92 శాతం కార్మిక శక్తి ఇంకా అవ్యవస్థీకృత రంగంలోనే ఉంది. కొన్ని లక్షలమంది వీధి వ్యాపారాలు వంటివాటితో జీవిస్తున్నారు.

నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సరిపోవడం లేదు. ఏటా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏదో ఒకరోజు నిరుద్యోగం ప్రభుత్వాలకు గుదిబండగా మారవచ్చు. యువత సంఘటితమై ప్రభుత్వ ప్రోత్సాహంతో కుటీర, చిన్న పరిశ్రమలను ప్రారంభించగలగాలి. ఎందుకంటే, అలాంటి వారు తమ సంక్షేమం కోసమే శ్రమిస్తారు గనుక వారు ఆర్థికంగా ఎదగ గలుగుతారు. ఫలితంగా, భారతీయ యువత ప్రపంచానికి రోల్‌మోడల్‌గా మారుతుంది. అందువల్ల ప్రభుత్వం పరిశ్రమలు, స్కూళ్లు, ఆస్పత్రులు వంటివి ఏర్పాటు చేయడం ద్వారా తన పౌరుందరికీ ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది.

జనాభా పెరుగుదలతో ముడిపడిన అనేక సమస్యలనూ ఈ నివేదిక ఎత్తి చూపించింది. 2036 నాటికి మహిళల సంఖ్య మొత్తం జనాభాలో 48.5 శాతానికి చేరుకోనుంది. అదే సమయంలో 60 ఏళ్లకు పైబడిన వృద్ధుల జనాభా కూడా విపరీతంగా పెరగనుంది. వీరి ఆలనాపాలనా చూడడం కుటుంబాలకే కాదు, ప్రభుత్వాలకూ భారమే అవుతుంది. అలాగే పట్టణ, గ్రామీణ జనాభా సైతం గణనీయంగా పెరగనుంది. ఈ పెరిగిన జనాభాకు కనీస అవసరాలైన తాగునీరు, గృహ వసతి, విద్య, వైద్య సదుపాయాలపై ప్రభుత్వాలు మరింత శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. దేశ జనాభాలో యువత శాతం పెరగడం ఓ సదవకాశమే కానీ దాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోని పక్షంలో సమస్యలు మరింత పెరిగే ప్రమాదముందని ఈ ప్రభుత్వ నివేదిక సారాంశంగా కనిపిస్తున్నది. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ సంకల్పం సాధించాలంటే ప్రభుత్వాలు తమ ప్రాధాన్యాలను సమీక్షించుకుని విప్లవాత్మక చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.