21-07-2024 02:38:00 AM
ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌తో ర్యాపిడో భాగస్వామ్యం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 20 (విజయక్రాంతి): ర్యాపిడో యాప్ ద్వారా మెట్రో టికెట్ బుకింగ్ చేసుకునేందుకు ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్(ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్) యాజమాన్యం ర్యాపిడో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే బైక్, ఆటో, ట్యాక్సీ తదితరల సేవలందిస్తున్న ర్యాపిడో సంస్థ.. మెట్రో టికెట్ బుకింగ్ సేవలు కూడా అం దించడానికి ఎల్‌అండ్‌టీఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్‌తో భాగస్వామ్యం చేసుకున్నట్లు ప్రకటిం చింది. ర్యాపిడో ద్వారా మెట్రో స్టేషన్ వరకు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని, అదేవిధంగా ర్యాపిడో యాప్ ద్వారానే మెట్రో టికెట్ కూడా కొనుగోలు చేయవచ్చని ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్, ర్యాపిడో యాజ మాన్యాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
ఈ సందర్భంగా ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రో రైల్‌తో కలిసి పని చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు తాము అంకితభావంతో కృషి చేస్తున్నామని చెప్పారు. ర్యాపిడోతో భాగస్వామ్యం మరిన్ని సమర్థవంతమైన సేవలందించేందుకు తోడ్పడుతుందన్నారు. కార్యక్రమంలో ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ హెడ్ బిభుదత్తమిశ్రా సహా ఆ సంస్థ అధికారులు, ర్యాపిడో అధికారులు పాల్గొన్నారు.