22-08-2025 01:28:54 AM
సూర్యాపేట / కోదాడ, ఆగస్టు 21 (విజయక్రాంతి) : కోట్లకు అధిపతులు.. అయినా వారి ధనదాహం తీరడం లేదు. ప్రకృతి సృష్టించిన సహజ సౌందర్యాలను విధ్వంసం చేస్తూ.. పర్యావరణాన్ని దెబ్బతీస్తూ..
దానిని ఆవాసంగా చేసుకుని బతుకుతున్న వన్య ప్రాణులకు ముప్పు తలపెడుతూ భవిష్యత్లో మహా ప్రళయానికి బరితెగించారు. ఇప్పటికే సహజ వనరులను దోచేసి క్వారీ వేస్ట్ ను రాశులుగా పోస్తూ.. నోట్ల కట్టలను గుట్టలుగా పేర్చే పనిలో పడ్డారు... జిల్లాలోని కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామ పరిధిలోని మిడ్ వేస్ట్ గ్రానైట్ నిర్వహకులు...
భారీగా పేలుళ్లు.. భూ ప్రకంపనాలు..
మండల పరిధిలోని నల్లబండగూడెం మంగలి తండా సమీపంలో మిడ్ వెస్ట్ గ్రానైట్ ను ఏర్పాటు చేయగా వారు అనుసరిస్తున్న విధానాలతో ఆయా గ్రామాలకు చెందిన వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. యాజమాన్యం నిబంధనలకు పాతర వేసి తవ్వకాల జాతరతో సంపాదన యాతర చేస్తుందని అభిప్రాయాలు స్థానికంగా వినిపిస్తున్నాయి. సుమారు 50 పైనే ఎకరాలలో ఉన్న క్వారీలో పేలుళ్లు ధాటికీ వచ్చే శబ్దాలు స్థానికులకు ఆటంకంగా మారడం పాటు, రాత్రివేళల్లో నిద్రకు అవరోధంగా మారుతున్నాయి.
క్వారీ నుండి వెలువడే ధూళి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించి, ప్రజల ఆరోగ్యంపై, పంటలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు స్థానికుల ద్వారా తెలుస్తుంది. భూమి కంపించడం వల్ల ఇళ్లు, గోడలకు బీటలు, పగుళ్లు వస్తున్నాయనీ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. క్వారీలలో ఉపయోగించే రసాయనాలు నీటిలో కలిసి కలుషితం కావడం వలన తాగునీటికి ఇబ్బంది ఏర్పడుతుంది అని వాపోతున్నారు.
హైదరాబాద్ _ విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని క్వారీ ఉండడంతో..క్వారీలకు సంబంధించిన వాహనాల రాకపోకల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. ధూళి, కాలుష్యం కారణంగా ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, చర్మ సంబంధిత వ్యాధులుతో బాధపడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
గత ఏడాది జాతీయ రహదారి కోతకు కారణం గ్రానైట్ వేస్టేజీనే.. :
క్వారీలో వేస్టేజ్ రాళ్లను డంపు చేయడం వలన క్వారీ వెనక వైపున పెద్ద గుట్టగా ఏర్పడి. పాలేరు వాగు నుండి వచ్చే వరద నీరు వెడల్పుగా ప్రవహించేందుకు వీలు లేకుండా పోయిందని స్థానికుల ద్వారా తెలుస్తుంది. అయితే దీని కారణంగానే గత ఏడాది సెప్టెంబర్ లో కురిసిన భారీ వర్షాలకు నీరు ప్రవహించేందుకు వీలు లేకపోవడంతో ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతం వద్ద జాతీయ రహదారి కోతకు గురి అయిందనేధి ఈ ప్రాంత వాసులు చెప్పిన మాట.
ఆ సమయంలో వందల ఎకరాలలో పంట నష్టం జరిగిన విషయం అందరికి తెలిసిందే. గతంలో రైతులు, స్థానికులు క్వారీ నిర్వాహకులను ఇలా ఎందుకు డంప్ చేస్తారని ప్రశ్నిస్తే మా భూమీ లోనే చేసుకున్నామని సమాధానం చెప్పినట్లు తెలు స్తుంది. ఈ ఏడాది ఆ డంప్ మరింత పెరిగింది తప్ప తొలగించలేదు. మరల భారీ వర్షాలు కురిస్తే మళ్లీ తీవ్ర వరదలతో జాతీయ రహదారి మళ్లీ భారీగా కోతకు గురవుతుందని, పంటలు నష్టపోతామని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రజాభిప్రాయ సేకరణ పై పెదవి విరుపు : కొన్ని ఏండ్లుగా ప్రకృతిని విధ్వంసం చేస్తూ కోట్లు గడిస్తున్న మిడ్ వెస్ట్ గ్రానైట్ యాజమాన్యం తమ సామ్రాజ్యాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు 9.87 హెక్టార్ ల విస్తరణ పేరుతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని గత మంగళవారం క్వారీలో ఏర్పాటు చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో నడిచింది.
ప్రజాభిప్రాయ సేకరణ ఉందని చుట్టుపక్కల గ్రామాలలోని నల్లబండగూడెం, మంగలి తండా గ్రామస్తులకు నేరుగా సమాచారం ఇవ్వకుండా కేవలం వారికి అనుకూలమైన వ్యక్తులకు మాత్రమే సమాచారం ఇచ్చి విస్తరణకు అనుకూలంగా చెప్పించుకున్నారనే వార్తలు స్థానికంగా గట్టిగానే వినిపిస్తున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణ అంటే గ్రామాలలో చాటింపు వేయించి ప్రజలకు నేరుగా సమాచారం ఇవ్వాలి కానీ కొంతమంది నాయకులకు మాత్రమే సమాచారం ఇవ్వడం ఏమిటనే ప్రశ్నలు వేస్తున్నట్లు తెలుస్తుంది.
గతంలో క్వారీ ఏర్పాటు సమయంలో మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, మీ గ్రామాలను అభివృద్ధి చేస్తామని నమ్మించి మమ్మల్ని నట్టేట ముంచారని ఇప్పుడు అభివృద్ధి మాట దేవుడెరుగు బ్లాస్టింగ్ దాటికి ప్రతిరోజు రాత్రి బికు, బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నామనే వార్తలు స్థానికంగా వినిపిస్తున్నాయి. జాతీయ రహదారీకి అనుకొని ఉన్న మా రహదారుల అద్వానంగా ఉన్నాయని ఈ క్వారీ పుణ్యాన రహదారులు కూడా మాకు సరిగ్గా లేవంటూ వారు వాపోతున్నారు.
మా జీవనం అస్తవ్యస్తంగా మారిందని అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందని అధికారులు వారిచే మామూళ్ల మత్తులో తూగుతున్నారని స్థానికుల ద్వారా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మంగళవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంను పరిగణంలోకి తీసుకోకుండా నేరుగా కలెక్టర్ క్వారీ వద్దకు వచ్చి పరిశీలన చేసి, వాస్తవికంగా గ్రామస్తుల అభిప్రాయం తెలుసుకొని తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో కొంతమంది తమకు అనుకూలంగా మాట్లాడేందుకుగాను గ్రానైట్ నిర్వాహకులు వారికి ముందస్తుగా ముడుపులు చెల్లించినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తుంది.
మిడ్ వెస్ట్ క్వారీలో బాంబ్ బ్లాస్ట్ లు బాగా జరుగుతున్నాయి. దీంతో రైతుల వ్యవసాయ బావులన్నీ బూడుతున్నయ్. నీరు లేక పంట పొలాలకు భారీ నష్టం జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదు.
నెల రోజుల క్రితం భారీ బాంబ్ బ్లాస్ట్ కు పొలంలో కలుపుతీస్తున్న మహిళలపై గ్రానైట్ రాయి కొద్దిపాటి దూరములో పడ్డది. ఇది రెండోసారి కావడంతో పొలంలో పనిచేయడానికి కూలీలు సైతం రావడంలేదు. అధికారులకు చెప్తే పట్టించుకోరు.. యజమానులకు చెప్తే ఫలితం లేదు. మా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.