calender_icon.png 29 July, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రషర్ స్థలాన్ని పరిశీలించిన మైనింగ్ ఏడీ

06-12-2024 12:29:21 AM

పటాన్‌చెరు: జిన్నారం మండలం నల్తూరు గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 160లో క్రషర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నల్దూరు గ్రామస్తులు ఇటీవల భారీ ఎత్తున ఆందోళన, ధర్నా నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌కు, జిన్నారం తహసీల్దార్‌కు క్రషర్ ఏర్పాటు చేయోద్దంటూ వినతి పత్రాలను అందజేశారు. కాగా గ్రామస్తులు చేపట్టిన ధర్నా, ఆందోళనల నేపథ్యంలో మైనింగ్ ఏడీ మధుసూదన్ గురువారం నల్తూరు గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 160లో క్రషర్‌కు కేటాయించిన స్థలాన్ని తహసీల్దార్ ఎం. భిక్షపతితో కలిసి పరిశీలించారు. ఏడీ రావడంతో నల్తూరు, కొర్లకుంట గ్రామస్తులు భారీగా వచ్చారు.

గ్రామ పరిధిలో క్రషర్ ఏర్పాటు చేయోద్దని గ్రామస్తులందరు మూకుమ్మడిగా ఏడీని కోరారు. పచ్చని పొలాలు ధ్వంసం అవుతాయని, ఇండ్లన్ని బీటలు పారుతాయని, దుమ్ము, దూళితో మా ఆరోగ్యాలు పాడవుతాయని బాధలను ఏడీకి చెప్పుకున్నారు. స్పందించిన మైనింగ్ ఏడీ మధుసూదన్ సంబంధిత క్రషర్ యాజమాన్యంతో ఫోన్‌లో మాట్లాడారు. ఇక్కడ ఎలాంటి పనులు చేయోద్దని, ఇటాచి, ఇతర మిషనరీని సాయంత్రం వరకు తొలగించాలని సూచించారు. గ్రామస్తుల అభిప్రాయాలను, ఇక్కడి పరిస్థితిని నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. మాజీ సర్పంచ్ జనార్దన్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, భీమ్‌రావు గ్రామస్తులు పాల్గొన్నారు.