calender_icon.png 22 August, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీజ్ పండుగలో మంత్రి జోష్!

22-08-2025 12:50:06 AM

గిరిజనులతో కలిసి డాన్స్

హుస్నాబాద్, ఆగస్టు 21 : సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన తీజ్ పండుగ వేడుకలకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై సందడి చేశారు. గురువారం జరిగిన ఈ వేడుకల్లో గిరిజన సోదర సోదరీమణులతో కలిసి నృత్యం చేసి వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. గిరిజన యువతులు, మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తుండగా,

మంత్రి పొన్నం ప్రభాకర్ వారి మధ్యకు వెళ్లి డీజే పాటలకు అనుగుణంగా స్టెప్పులు వేశారు. తెల్లని చొక్కా, కండువా ధరించిన మంత్రి, ఎలాంటి మొహమాటం లేకుండా గిరిజనులతో కలిసి నృత్యం చేయడంతో అక్కడున్న వారంతా హర్షం వ్యక్తం చేశారు. గిరిజనుల ఆచారాలను గౌరవిస్తూ తలపాగా ధరించిన ఆయన, వారి సంప్రదాయ నృత్య భంగిమలను అనుసరిస్తూ ఉత్సాహంగా అడుగులు వేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘తెలంగాణ సంస్కృతికి తీజ్ పండుగ ఒక ప్రతీక. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉన్నారు. గిరిజన తండాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది‘ అని అన్నారు. మంత్రి ఆప్యాయంగా కలిసిపోయి నృత్యం చేయడంతో గిరిజనులు ఆనందంతో పులకించిపోయారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గిరిజన సంఘాల నేతలు  పాల్గొన్నారు.