22-01-2026 12:24:20 AM
కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి సవాల్
మేడ్చల్, శామీర్ పేట్, జనవరి 21 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ 10 శాతం మున్సిపాలిటీలు గెలిస్తే తాను దేనికైనా సిద్ధమేనని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ చేశారు. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అలియాబాద్ లో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో 10% గెలవకున్నా సర్పంచులకు సన్మానాలంటూ హడావిడి చేశారని, పార్టీ గుర్తుతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, మూడేళ్లలో అధికారంలోకి వస్తామని కేటీఆర్ ఇటీవల పోలీసులను బెదిరించారని, కానీ ఎప్పటికీ అధికారంలోకి రాలేరన్నారు.
2018లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆరు నెలల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తాము మూడు పార్లమెంటు స్థానాలు గెలుపొందామని, 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలువ లేకపోయిందని, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల సిట్టింగ్ స్థానాలను కూడా కాపాడుకోలేకపోయిందని విమర్శించారు. కెసిఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, తాము వడ్డీలు కడుతున్నామని అన్నారు. జిల్లాలో మూడు మున్సిపాలిటీలను పెద్ద మెజారిటీతో గెలిపించుకోవాలని, మున్సిపాలిటీల అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు.
సెక్రటేరియట్లో ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేసి ఓఎస్డిని నియమిస్తానన్నారు. ఏ పని ఉన్న చాంబర్లో సంప్రదించవచ్చన్నారు. సర్వేల ఆధారంగానే మున్సిపల్ ఎన్నికల టికెట్లు కేటాయిస్తామని మంత్రి స్పష్టం చేశారు. తనకు ఎమ్మెల్యే టికెట్ సర్వే ఆధారంగానే వచ్చిందని గుర్తు చేశారు. సర్వేలో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తనకు అనుకూలంగా రావడంతో వైయస్ రాజశేఖర్ రెడ్డి తన పేరు సిఫార్సు చేశారని, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీనియర్ నాయకుడు రఘు మా రెడ్డి పేరును సిఫారసు చేశారన్నారు. టికెట్లు రానివారు అసంతృప్తి చెందవద్దని, కో ఆప్షన్ లేదా ఇతర నామినేటెడ్ పదవుల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఏమీ లేదని, కానీ ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేవారు ఉండబోరన్నారు. డిసిసి అధ్యక్షుడు వజ్రాస్ యాదవ్ మాట్లాడుతూ ఎంపీ ఈటెల రాజేందర్ ఒక్క అభివృద్ధి పని మంజూరు చేయించలేదని విమర్శించారు. జిల్లాకు కేంద్రీయ, ఇతర విద్యాసంస్థలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, డిసిసి మాజీ అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మాజీ మేయర్ అజయ్ కుమార్, నక్క ప్రభాకర్ గౌడ్, మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్, తునికి రమేష్, విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తల హాజరు అంతంతే
ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీల కార్యకర్తల సన్నాహక సమావేశానికి కార్యకర్తలు అంతంతమాత్రంగానే హాజరయ్యారు. ఒక మంత్రి కార్యక్రమంగా జరగలేదు. కార్యకర్తలు తక్కువగా హాజరు కావడంతో కాంగ్రెస్ నాయకుల సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తలు తక్కువగా హాజరు కావడాన్ని ఒక నాయకుడు వేదికపైనే ఎత్తిచూపారు. కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఎక్కువ మంది కార్యకర్తలు హాజరయ్యారని, ప్రస్తుతం తక్కువ మంది హాజరు కావడంపై కారణమేమిటో నాయకులు ఆలోచించాలన్నారు. హాజరైన కార్యకర్తల్లో ఎక్కువమంది షామీర్పేట్, మేడ్చల్, గుండ్ల పోచంపల్లి తదితర ప్రాంతాలకు చెందిన వారున్నారు.