calender_icon.png 28 July, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువులేన్నుంచొస్తయో తెల్వదా?

27-07-2025 10:39:08 PM

వాటిని దాచేంత పిచ్చి మాకు లేదు..

దమ్ముంటే కేంద్రాన్ని నిలదీయాలె..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..

హుస్నాబాద్: తెలంగాణలో ఎరువుల కొరతపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిరాధార, అవివేక ఆరోపణలు చేస్తున్నారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎరువుల సరఫరా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుందన్న కనీస అవగాహన కూడా రామచంద్రరావుకు లేదని, వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలపై ఆయనకు జ్ఞానం కొరవడిందన్నారు. "బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఎరువులు ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియనట్టుంది.

వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉంటాయో ఆయన తెలియదు" అని మంత్రి ఎద్దేవా చేశారు. రాష్ట్రాలు విత్తనాలు, నీరు, విద్యుత్ వంటివి అందిస్తాయని, ఎరువుల తయారీ, సరఫరా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయని ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు. తెలంగాణకు సరైన రీతిలో ఎరువులు సరఫరా చేయలేకపోయిన కేంద్రం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

ఎరువులు దాచేంత పిచ్చి కాంగ్రెస్‌కు లేదు

కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువులను దాచిపెడుతోందన్న బీజేపీ నాయకుల వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. "రైతులకు ఎరువులను దాచిపెట్టి  కాంగ్రెస్ ప్రభుత్వం పిచ్చి పని చేస్తుందని అనుకుంటున్నారా? రైతుల పట్ల మా ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉంది" అని అన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో తెలంగాణ పట్ల కేంద్రం వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని, ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం కనీసం "దున్నపోతు మీద వాన పడ్డట్టు కూడా" స్పందించడం లేదని విమర్శించారు. వారికి రైతులు, పల్లెలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అంటే తెలియదని, హైదరాబాద్‌లో కూర్చొని ఏది పడితే అది మాట్లాడితే కుదరదని దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన మంత్రి, వెంటనే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితో చర్చించి తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేయించాలని డిమాండ్ చేశారు.

"రైతుల దగ్గర రాజకీయం అవసరం లేదు. యావత్ రైతాంగం ఎరువులు కావాలని డిమాండ్ చేస్తోంది" అని కేంద్రానికి గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే సంబంధిత కేంద్ర మంత్రులను కలిసి ఎరువుల సరఫరాను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారన్నారు. ఎరువుల నిల్వలు, సరఫరా వివరాలు తెలుసుకొని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ని డిమాండ్ చేశారు. ఎరువుల కేటాయింపు కేంద్రం పరిధిలోని అంశమని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర జరుగుతోందని, రైతులను ఇబ్బంది పెట్టే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు.