calender_icon.png 22 August, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావి గొంతెమ్మ కోర్కెలు కావు!

22-08-2025 01:14:44 AM

రోడ్డు మీదకు వస్తే మమ్మల్ని ఆపలేరు

ప్రభుత్వాన్ని హెచ్చరించిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ

ప్రభుత్వానికి ఆందోళన కార్యాచరణ నోటీసు అందజేత

హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): ప్రభుత్వాన్ని తాము అడిగేవి గొంతెమ్మ కోరికలు కావని, న్యాయం గా తమకు రావాల్సిందే అడుగుతున్నామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేత లు చెప్పారు. సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర, అక్టోబర్ 12న హైదరాబాద్‌లో నిర్వహించే బహిరంగసభకు సంబంధిం చిన నోటీసులను జేఏడీ సర్వీసెస్ మహేశ్ దత్ ఎక్కాకు జేఏసీ నేతలు గురువారం సచివాలయంలో కలిసి అందజేశారు.

ఈ సందర్భంగా సచివాలయం ఆవరణలోని మీడియా పాయింట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడారు. మొత్తం రూ.2100 కోట్లలో ప్రభుత్వం ప్రతినెలా రూ. 700 కోట్ల చొప్పున పెండింగ్ నిధులు చెల్లిస్తామని గతంలో డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారని, అయితే గత మూడు నెలలకుగానూ ఇప్పటివరకు కేవలం రూ. 700 కోట్లను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.

హామీల అమలు కోసం జంగ్ సైరన్ మోగిస్తున్నామని తెలిపారు. ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు, హెల్త్ కార్డులు, డీఏలతో సహా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని, కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. 200 పైగా ఉద్యోగుల సంఘాలతో జేఏసీగా ఏర్పడి,  హామీల కోసం పోరాడుతున్నామని.. ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఉద్యమ కార్యచరణ ప్రకటించామని పేర్కొన్నారు.

బెనిఫిట్స్ అందడంలేదు..

రిటైర్డ్ అయ్యాక రెండు ఏళ్లు అవుతున్నా బెనిఫిట్స్ రావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని కోరామని, సెప్టెంబర్‌లో బస్సు యాత్ర, అక్టోబర్ 12న ఛలో హైదరాబాద్‌ను జయప్రదం చేస్తామన్నారు. ఉద్యోగులందరూ అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఎల్‌బీ స్టేడియంలో భారీ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. తమను రోడ్డు మీదకు తీసుకురావొద్దని, వస్తే మమ్మల్ని ఆపలేరని ప్రభుత్వానికి హెచ్చరించారు.

సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా ఐదు నుంచి పదివేల మందితో పబ్లిక్ గార్డెన్ లలితకళా తోరణంలో పాత పెన్షన్ సాధన పోరాట సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్‌ను జేఏసీ నేతలు విడుదల చేశారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు ముజీబ్, పుల్గం దామోదర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సదానందం గౌడ్, బీ శ్యామ్, సత్యనారాయణ, కటకం రమేష్, గుండు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.