06-01-2026 03:36:07 PM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో శ్రీధర్ బాబు(Minister Sridhar Babu ) మాట్లాడుతూ.... పూర్వీకులు స్వచ్ఛమైన ప్రకృతిని వారసత్వంగా మనకు అందించారని తెలిపారు. రేపటి తరానికి స్వచ్ఛమైన ప్రకృతిని అందజేస్తున్నామా.. లేదా అని ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. మనం వారసత్వంగా ఇచ్చిన సంపద వారి ప్రాణాలను కాపాడుతుందా? ప్రకృతి ఒకసారి నాశనమైతే తిరిగి తీసుకురాలేమని మంత్రి తెలిపారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతి అందించడం మన బాధ్యతన్నారు. రేపటి తరాల భవిష్యత్, నేల మనుగడ కోసం హిల్ట్ పాలసీ తీసుకొస్తున్నామని సూచించారు.
హిల్ట్ పాలసీని సాదాసీదా భూ మార్పిడిగా చూస్తున్నారని పేర్కొన్నారు. హిల్ట్ పాలసీపై(Hilt Policy) సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తామన్నారు. మాపై బురద చల్లాలని విమర్శలు చేసేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలని తెలిపారు. హిల్ట్ పాలసీ ద్వారా పారిశ్రామిక ప్రాంతం.. నివాసప్రాంతంగా మారుతోందన్నారు. ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాల్లో కాలుష్యం లేకుండా చేసేందుకు సీఎం యత్నిస్తున్నారని చెప్పారు. నగరంలోని పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలివైపునకు తరలిస్తామన్నారు. జీడిమెట్ల, ఉప్పల్, సనత్ నగర్, చర్లపల్లి ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ జోన్లుగా ఉండేవన్నారు. జీడిమెట్ల, ఉప్పల్, సనత్ నగర్, చర్లపల్లి ప్రాంతాలు ఒకప్పుడు జనావాసాలకు దూరంగా ఉండేవని మంత్రి వివరించారు. 50 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంగా విస్తరించిందని శ్రీధర్ బాబు తెలిపారు.
ఒపప్పుడు నగర శివారు ప్రాంతాలు ప్రస్తుతం రెసిడెన్షియల్ కాలనీస్ గా మారాయన్నారు. ప్రస్తుతం పరిశ్రమలకు పక్కనే అపార్టుమెంట్లు ఉన్నాయని వెల్లడించారు. పరిశ్రమల నుంచే వచ్చే పొగను ప్రత్యక్షంగా పీలుస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు, రెసిడెన్షియల్ ప్రాంతాలకు మధ్య బఫర్ జోన్లు లేవన్నారు. బఫర్ జోన్లు లేకపోవడం వల్ల ఎల్జీ పాలిమర్స్, భోపాల్ గ్యాస్ దుర్ఘటనలు జరిగాయని వివరించారు. నగరంలోని భూగర్భజలాల్లో విషపూరిత పదార్థాలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. పారిశ్రామిక రసాయనాల వల్లే భూగర్భజలాల్లో విషపూరిత పదార్థాలు చేరాయన్నారు. ఇప్పటికీ మేల్కోకపోతే హైదరాబాద్ కూడా ఢిల్లీ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జాగ్రతలు తీసుకోకపోతే ప్రతి ఇంటికి ఒక ఆస్పత్రి ఉంటుందని హెచ్చరించారు. హిల్ట్ పాలసీ విషయంలో సభ్యులు రాజకీయాలు పక్కనపెట్టాలని మంత్రి కోరారు.
చైనాలో బ్లూస్కై పాలసీ ద్వారా.. భారీ పరిశ్రమలను నగరం అవతలివైపునకు తరలించారని చెప్పారు. పారిశ్రామిక ప్రగతి అంటే.. ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిందని మంత్రి స్పష్టం చేశారు. ఢిల్లీలో నివాసాల మధ్య ఉన్న 168పరిశ్రమలను తరలించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రాతిపదికన హిల్ట్ పాలసీ తీసుకొచ్చామని వివరించారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు ఓఆర్ఆర్ లోపల ఉండకూడదని హిల్ట్ పాలసీ తీసుకొచ్చామన్నారు. హిల్ట్ పాలసీ మేము కొత్తగా చేస్తున్నది కాదు.. హిల్ట్ పాలసీ కోసం విస్తృతంగా చర్చలు జరిగాయన్నారు.
వనరులు సమకూర్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. హిల్ట్ పాలసీ గురించి తెలియకుండా ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జీవోఎంఎస్ 19కు సంబంధించి లీజు భూములపై ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయని గత ప్రభుత్వం జీవో తెచ్చిందన్నారు. పారదర్శకంగా ఉండే హిల్ట్ పాలసీని మా ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. స్వచ్ఛందగా ముందుకు వస్తే భూములు కన్వర్ట్ చేస్తామని మంత్రి సూచించారు. నగరవాసులను కాలుష్యం నుంచి రక్షించాలన్నదే మా లక్ష్యమని తెలిపారు. పారిశ్రామికవేత్తల భూములను.. ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హేతుబద్ధత, శాస్త్రీయత ఉండాలని చూస్తున్నామన్నారు. భవిష్యత్ గురించి ఆలోచించి ప్రజా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లడించారు.