calender_icon.png 22 November, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరచేతిలో అద్భుతాలు

26-07-2024 02:30:00 AM

కుడి అరచేతిని దోసిలిగా పట్టి నీళ్లు తాగడం చాలామందికి తెలిసిందే. అర్ఘ్యం వదలడానికి, తర్పణాలు విడవడానికి, ఇంకా దేవతా విగ్రహాలకు అభిషేకం చేసిన తీర్థాన్ని సేవించడానికి మన (కుడి) అరచేతిని వాడుతాం. ఎందుకు? ఈ అరచేతికి వున్న విలువ, గొప్పతనం గురించి ‘భవిష్య పురాణం’ వివరించింది. ఆ వివరాలు తెలుసుకుంటే, అరచేతిలో ఆధ్యాత్మిక అద్భుతాలకు మూలం అర్థమవుతుంది.

కుడి అరచేతిలో అయిదు తీర్థ స్థానాలు ఉన్నాయి. అవి వరుసగా: దేవతీర్థం, పితృతీర్థం, ప్రజాపత్య తీర్థం, సౌమ్యతీర్థం, బ్రహ్మతీర్థం. చేతివ్రేళ్ల అగ్రభాగంలో ‘దేవతీర్థం’ ఉంటుంది. చూపుడు వ్రేలుకుె బొటన వ్రేలుకు మధ్య భాగాన్ని ‘పితృతీర్థం’ అంటారు. చిటికెన వ్రేలుకు దిగువ భాగాన్ని ‘ప్రజాపత్య తీర్థం’ అంటాం. బొటనవ్రేలుకు దిగువన ఉన్న భాగమే ‘బ్రహ్మ తీర్థం’. ఇక, అరచేతి నడిమి ప్రదేశం ‘సౌమ్యతీర్థం’గా వ్యవహరిస్తారు.

చేతివ్రేళ్లను కలిపి ఏకాగ్ర చిత్తంతో, పవిత్రమైన జలాన్ని శబ్దం చేయకుండా మూడుసార్లు దేవతా విగ్ర హంపై అభిషేకం చేయడం వల్ల గొప్ప ఫలితం చేకూరుతుంది. మొదటి నీటి చిలకరింతతో ఋగ్వేదం, రెండవ చిలకరింతతో యజుర్వేదం,  మూడవ చిలకరింతతో సామవేదం తృప్తి చెందుతాయని తెలుస్తున్నది. అలాగే, కుడిచేతి బొటనవ్రేలితో దేవతా విగ్ర హం ముఖాన్ని స్పర్శించటం వల్ల ‘అథర్వణ వేదం’ తృప్తి చెందుతుంది. పెదవులను స్పర్శించటం వల్ల ఇతిహాసం, పురాణాలు తృప్తి చెందుతా యి. మస్తకాన్ని (తల) స్పర్శిస్తే రుద్రుడు ప్రసన్నుడవుతాడు.

దేవ విగ్రహాల ఆయా భాగాలను స్పర్శ మాత్రం చేత ఆయా దేవతల తృప్తి ఫలం లభించగలదని (జుట్టువల్ల మహర్షులు, నేత్రా లవల్ల సూర్యుడు, నాసికవల్ల వాయుదేవుడు, చెవులవల్ల దిశలు, భుజాల వల్ల యమ, కుబేర, వరుణ, ఇంద్ర, అగ్నులు) ‘భవిష్య పురాణం’ చెబుతున్నది. ఇదే క్రమంలో విగ్రహ నాభిని స్పర్శించడం వల్ల అందరు దేవతలూ తృప్తి చెందుతారు. విగ్రహం కాళ్లు తాకడం వల్ల విష్ణుమూర్తి, భూమిలోకి నీటిని వదిలితే వాసుకి మున్నగు నాగులు తృప్తి చెందుతారు.

బొటనవ్రేలు చూపుడు వ్రేలుతో నేత్రాలను, బొటన వ్రేలు మధ్య వ్రేలుతో ముఖాన్ని, బొటనవ్రేలు ఉంగరపు వేలుతో నాసికను, బొటనవ్రేలు చిటికెన వ్రేలుతో చెవులను, అన్ని వేళ్లతో భుజాలను, బొటనవ్రేలుతో నాభిని, అన్ని వ్రేళ్లతో తలను స్పర్శించడం ఉత్తమ ఫలితాన్నిస్తుంది. బొటన వ్రేలు అగ్నిరూపమై ఉంటే, చూపుడు వ్రేలు వాయు రూపమై ఉన్నది. మధ్య వ్రేలు ప్రజాపతి రూపమై, ఉంగరపు వ్రేలు సూర్య రూపమై, చిటికెన వ్రేలు ఇంధ్ర రూపమై వున్నట్లు తెలుస్తున్నది.