26-07-2024 02:30:00 AM
‘మన బాధలకు అసలు కారణం స్వీయ విశ్వాసం లేకపోవడమే’ అని రమణ మహర్షి అనేవారు. ‘ఎవరు నువ్వు? ఎందుకు బాధ పడుతున్నావు? అసలు బాధ పడటానికి నువ్వెవరివని? ఈ బాధకు అసలు కారణం తెలుసా?’ అన్న దిశగా మనం ఆలోచించాలని చెప్పారు. మనకు నిజానికి పైకి కనిపించే బాధలు వేరు. అవి తాత్కాలికమైనవి. కానీ, శాశ్వతమైన బాధ మనపట్ల మనకు విశ్వాసం లేకపోవడం వల్లే కలుగుతుంది. ఆసక్తిగల వారిని భగవాన్ రమణుల బోధనలు మరింత లోతుల్లోకి తీసుకెళతాయి.
‘అసలు నువ్వు శరీరానివి అనుకుంటున్నావు. కానీ, నీ మనస్సు నిన్ను ఏమరుస్తుంది. నిన్ను శరీరానికి పరిమితం చేస్తుంది. నీ మనస్సుకు లొంగకుండా ఆత్మ స్వరూపానివని తెలుసుకోవాలి’ అని ఆయనంటారు. అందుకే, మనల్ని మనం నిరంతరం ఆత్మవిశ్వాసంతో జీవించాలి. ‘ఆత్మకు బాధ కలగదు. అది అగ్నిలో కాలదు. నీటిలో తడవదు. అసలు, ఆత్మకు చావు లేదు కదా! శరీరాలను మార్చుకుంటూ పోతుంది, అంతే. ఒక్కొక్క జన్మలో ఒక్కో పాఠం నేర్చుకొంటుంది. ఈ జన్మలో ఇలా. ఇంకొక జన్మలో వేరొక విధంగా.’
అందుకే, ఈ బాధలన్నీ పక్కన పెట్టేసి, ‘అసలు నువ్వెవరు?’ అన్న కోణంలో ఆలోచించాలని అంటారాయన. ‘ఎవరు నువ్వు? అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? జవాబు దొరికే వరకు విశ్రమించకుండా ప్రశ్నిస్తూనే ఉండాలి. ‘నేను ఎవరు’ ఇదే మన జీవిత లక్ష్యం కావాలి. అంతేగానీ, తాత్కాలికమైన బాధలను పుట్టకొని వేళ్లాడకూడదు.’
మనం ఈ జన్మలోకి వచ్చింది, ఏడవడానికి కాదని గుర్తుంచుకోవాలి. ‘నువు ఒక ఆత్మ పదార్థానివి. శరీరాన్ని దాల్చి నిన్ను నీవు చూసుకోవడానికి పుట్టావు. అసలు సంగతిని మరిచిపోయి బాధ పడుతున్నావు. ఈ సత్యం తెలిస్తే, నువు నిరంతరం ఆనందంగా ఉంటావు. బాధ భయంతో మన నుండి పారిపోతుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సున్నితంగా, నిష్కామంగా వుండటం నేర్చుకోవాలి. అప్పుడు మనలను ఏ పరిస్థితీ ఏమీ చేయలేదు. ఎందుకంటే, నేను చెప్పానుగా, నువు ఆత్మ పదార్థానివి. ఇది గుర్తు పెట్టుకుంటే చాలు.’ అని రమణులు అన్నారు.
ఒక సమస్య వచ్చింది అంటే, అది మనం పరిష్కరించుకోలేనిదేమీ కాదు. అలాంటిది ఏదీ నిజానికి వుండదు. మన వద్దకు రాదు కూడా. ఇది నిజం. ‘ఏ సమస్యనైనా నువ్వే ఛేదించుకోగలవు. నన్ను నమ్ము. నేను చెప్పేది పూర్తిగా విశ్వసించు. ఏ పరిష్కారమైనా నీ వల్లే అవుతుంది. ఇకనుంచి నిన్ను నువ్వు విశ్వసించడం నేర్చుకో. అప్పుడు ఏమైనా చేయగలవు. ఏమైనా సాధించగలవు. ఎందుకంటే, నేను పుట్టింది ఇది చేయడానికే అని నిన్ను నువ్వు విశ్వసించు’.