25-10-2025 02:34:02 PM
హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం(Low pressure) వాయుగుండంగా మారింది. వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా మారనుంది. తీవ్రవాయుగుండం ఎల్లుండి ఉదయానికి తుఫానుగా(Storm) మారే అవకాశముంది. వాయవ్యదిశలో కదిలి ఈనెల 28 నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ(India Meteorological Department) ప్రకటించింది. ఈనెల 28న కాకినాడ సమీపంలో తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశముందని తెలిపింది.
తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురు గాలులు వీయనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు(Telangana Rains) కురిసే అవకాశముందని వాతవరణ కేంద్రం ప్రకటించింది. ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. ఎల్లుండి ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముంది. భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.