30-01-2026 01:39:07 AM
మంచిర్యాల, జనవరి 29 (విజయక్రాంతి) : మంచిర్యాల సమీప గోదావరి నదీ తీరం భక్తజనసంద్రమైంది. గద్దెలకు సమ్మక్క చేరడంతో పెద్ద మొ త్తంలో భక్తులు తరలివచ్చారు. మంచిర్యాల ప్లై ఓవర్ బ్రిడ్జి నుంచి గోదావరి వరకు రోడ్డంతా సందడిగా మారింది. డప్పు వాయిద్యాలతో కన్నుల పండుగగా సమ్మక్క తల్లిని ఊరేగింపుగా గౌతమేశ్వర ఆలయ ప్రాంగణం వరకు తీసుకు రాగా అధిక సంఖ్యలో భక్తులు పూనకాలతో భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. గోదావరి నది తీరం భక్తులతో క్రిక్కిరిసిపోయింది. అమ్మవార్లను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దంపతులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, మంచిర్యాల మరింతగా అభివృద్ధి చెంది ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.