24-07-2024 08:55:09 PM
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సొమ్ముకు ధర్మకర్తలు మాత్రమే అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. ప్రజలు చెల్లించిన పన్నులనే ప్రభుత్వాలు ఖర్చు చేస్తాయని, నిధులు మేమిచ్చాం, మేమిచ్చాం.. అని అనటం సరికాదని కూనంనేని దుయ్యబట్టారు. రాష్ట్రాలు ఇవ్వకపోతే.. కేంద్రానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కేంద్రం జీఎస్టీ తెచ్చి రాష్ట్రాలను యాచకులుగా మార్చిందన్నారు.
దేశానికి నేడు రాజనీతిజ్ఞుల కొరత ఉందని, 2014 నుంచి కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కువయ్యాయని ఎమ్మెల్యే కూనంనేని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలు విడిపోవాలని డిమాండ్లు వచ్చేలా పరిస్థితి తయారైందని, ఈ పరిస్థితులు దేశానికి మంచిది కాదని ఆయన సూచించారు. బీజేపీకి దక్షిణాదితో సరిగా సీట్లు రావట్లేదు.. ఆ కోపం వాళ్లలో ఉందని, దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు రావట్లేదు కాబట్టే నిధులు సరిగా ఇవ్వట్లేదని వ్యంగ్యంగా మాట్లాడారు. ఇవాళ ఆంధ్రం ప్రదేశ్ అవసరం ఉంది కాబట్టే కొంచెం ఎక్కువ నిధులు ఇచ్చారని కూనంనేని చెప్పుకోచ్చారు.