calender_icon.png 19 August, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిష్యత్తు బాగు కోసం మనం శ్రమిద్దాం

19-08-2025 01:06:55 AM

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మనతోపాటు భవిష్యత్తు మరింత బాగుండాలని సంకల్పంతో అందరం కలిసి శ్రమిద్దాం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.   మహబూబ్ నగర్ నగరం లోని బండమీద పల్లి లోగల  రెడ్డి హాస్టల్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఐఐఐటి కళాశాలను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  మానస పుత్రిక ఐఐఐటి కళాశాల అని చెప్పారు. 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  వివిధ జిల్లాల నుంచి పదవ తరగతి లో వచ్చిన మార్కులను బట్టి  మెరిట్ ఆధారంగా 210 విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. మహబూబ్ నగర్ ఐఐఐటి కళాశాలలో ఈ నెల 22 వ తేదీన ఓరియంటేషన్ తరగతులను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ , టీచింగ్ సిబ్బంది నిర్వహిస్తారని అనంతరం రెగులర్ తరగతులు ప్రారంభం అవుతాయని ఆయన చెప్పారు.   ఇక్కడ ఇది తాత్కాలిక భవనమే అయినప్పటికీ హాస్టల్ యాజమాన్యం వారు విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలను, అత్యుత్తమమైన వసతులను కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు.    

దివిటిపల్లి లో 42 ఎకరాల్లో నిర్మించనున్న  అధునాతన ఐఐఐటి కళాశాల భవనానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  త్వరలో శంకుస్థాపన చేస్తారని ఆయన చెప్పారు.  రానున్న రెండు మూడు సంవత్సరాల్లో ఈ అధునాతన భవనం అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. అంతకుముందు  తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఐఐఐటి కళాశాల తరగతి గదులను, హాస్టల్ గదులను మరియు డైనింగ్ హాల్ ను పరిశీలించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని గ్రీన్ బెల్ట్ దగ్గర సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.