19-08-2025 01:05:46 AM
పీఆర్‌టీయూ నాయకుల డిమాండ్
మేడ్చల్, ఆగస్టు 18(విజయ క్రాంతి): కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని పి ఆర్ టి యు టీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. టి జి ఈ జె ఎ సి చైర్మన్ రవి ప్రకాష్, ప్రధాన కార్యదర్శి వినోద్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రామేశ్వర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించి సిపిఎస్ రద్దు చేయకుండా ఉద్యోగులను మోసం చేసిందని అన్నారు.
కాంగ్రెస్ సిపిఎస్ ను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. కొత్త పెన్షన్ విధానం 2004 సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి అమలులోకి వచ్చిందని, ఆ రోజును విగ్రహ దినంగా పాటిస్తూ ఉద్యమాలు చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన ఇందిరాపార్క్ వద్ద పిఆర్టియు టీఎస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఆరోజు సెలవు పెట్టి నల్ల దుస్తులతో మహాధర్నాలో పాల్గొనాలన్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ కలెక్టరేట్ వద్ద వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.