21-05-2025 12:48:15 AM
అమెరికా నటి, హీరోయిన్ జోశర్మ ప్రధాన పాత్రలో మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో ‘ఎం4ఎం: మోటివ్ ఫర్ మర్డర్’ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమా తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంపిక సంగతీ విదితమే. కాగా ఈ చిత్రం తాజాగా అక్కడి పలైస్ థియేటర్‌లో రెడ్ కార్పెట్ స్క్రీనింగ్ జరిగిందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు హీరోయిన్ జోశర్మ, డైరెక్టర్ మోహన్.
ఈ సందర్భంగా జోశర్మ మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయ ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరైన ఈ వేడుకలో తమ సినిమా ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు, విమర్శకులు, సినీ అభిమానుల నుంచి దక్కిన ప్రశంసలు మరిచిపోలేను. నేను, మా డైరెక్టర్ రెడ్ కార్పెట్‌పై మెరిసిన ఆ సందర్భం మర్చిపోలేది’ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ.. “ఎం4ఎం’ కేన్స్ 2025లో ప్రదర్శించిన ఏకైక తెలుగు చిత్రం కావటం గర్వంగా ఉంది. గ్లోబల్‌గా గుర్తింపు పొందుతున్న జోశర్మ.. దుబాయ్, ఢిల్లీల్లోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తుల్లో కేన్స్ వేడుకలో సందడి చేశారు. ఆమె ఫ్యాషన్ సెన్స్, నటనా ప్రతిభకు అక్కడి మీడియా ప్రశంసలు కురిపించడం నన్ను ఆశ్చర్యపరిచింది. మా సినిమాను త్వరలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాష ల్లో థియేటర్ల ద్వారా విడుదల చేస్తాం’ అని చెప్పారు.