calender_icon.png 24 December, 2025 | 9:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పేడు వీరాపురం పాఠశాలలో మాక్ పార్లమెంట్

24-12-2025 12:51:49 AM

కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహణ

వెంకటాపురం(నూగూరు), డిసెంబర్ 23(విజయక్రాంతి):మండలంలోని ఉప్పేడు వీరాపురం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం మాక్ పార్లమెంట్ కార్యక్రమం విద్యార్థులతో నిర్వహించారు. విద్యార్థులకు ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించడంలో ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమానికి సంబంధించి విద్యార్థులు ప్రదర్శించిన విధి విధానాలు కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ వెంకటాపురం డైరెక్టర్ లూర్దురాజ్ తెలిపారు. లోకసభ నిర్వహణ, అసలైన లోకసభలో చర్చలు ఎలా జరుగుతాయి, స్పీకర్ పాత్ర ఏమిటి అనే అంశాలను విద్యార్థులు కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించారు. కేంద్ర మంత్రుల ప్రసంగాలు, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతల పాత్రలు విద్యార్థులు పోషించారు.

దేశ సమస్యలపై మంత్రులు ఎలా సమాధానం ఇస్తారు, బిల్లులను ఎలా ప్రవేశపెడతారు అనే అంశాలను నేర్చుకున్నారు. ప్రశ్నోత్తరాల సమయం, సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధిత మంత్రులు ఇచ్చే వివరణలు, సభా మర్యాదలు పాటించడం వంటి విధివిధానాలను విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమం వల్ల ఉపయోగాలు, నాయకత్వ లక్షణాలు, విద్యార్థుల్లో భయం పోయి, సభలో మాట్లాడే ధైర్యం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని లూర్డురాజ్ వివరించారు. రాజ్యాంగ అవగాహన, దేశ పరిపాలన ఎలా సాగుతుంది? చట్టాలు ఎలా తయారవుతాయి?

అనే విషయాలపై ప్రాథమిక అవగాహన కలుగుతుందని తెలిపారు.వాక్చాతుర్యం, ఎదుటివారి వాదనను గౌరవిస్తూనే, తమ గళాన్ని ఎలా వినిపించాలో విద్యార్థులు నేర్చుకున్నారని తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ సత్యనారాయణ మాట్లాడుతూకాఫేడ్ స్వచ్ఛంద సంస్థ ఇలాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో చైతన్యం నింపడం అభినందనీయం అన్నారు. అలాగే ఉప్పేడు వీరాపురం సర్పంచ్ జెజ్జరి మానస మాట్లాడుతూ పిల్లలు క్రమశిక్షణతో ఉండాలని, మంచి చదువులు చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ లూర్థూరాజు మాట్లాడుతూ పిల్లలు హక్కులు, జీవితంలో ధైర్యంగా ఉండాలని, ఇష్టంగా చదవాలని, మంచి ఆలోచన కలిగి ఉండాలనీ చెప్పారు. స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కోరం సంతోష్, ఉపాధ్యాయులు, కాఫెడ్ సంస్థ కోఆర్డినేటర్స్ గొంది హనుమంతు, కామేష్, యానిమేటర్స్ ప్రశాంత్, నరేష్, ఇందిర, ఉష, పద్మ, భాస్కర్, రమాదేవి, స్వరూప, సుజల, పిల్లల తల్లిదండ్రులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.