17-09-2025 05:57:38 PM
దేశ రైతుల సంక్షేమమే ప్రధాని టార్గెట్
ప్రధాని జన్మదినం సందర్భంగా నేటి నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు
బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్
హన్మకొండ,(విజయక్రాంతి): భారత దేశాన్ని సూపర్ పవర్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ అహర్నిశలు శ్రమిస్తున్నారని బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పేర్కొన్నారు. బుధవారం ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందరమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు.
ఇందులో భాగంగానే అమెరికా ఎంత ఒత్తిడి చేసినా రైతుకు నష్టం కలిగించే పరికరాలను దిగుమతి చేసుకునేందుకు నిరాకరిస్తున్నారని వెల్లడించారు.ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నేటి నుంచి గాంధీ జయంతి లాల్, బహుదూర్ శాస్త్రి జయంతి ఆయన అక్టోబర్ రెండు వరకు సేవాపక్ష కార్యక్రమాలను జిల్లా కన్వీనర్ కనుకుంట్ల రంజిత్, కో కన్వీనర్లు కర్నే రవీందర్, కొంతం సంగీత్ ల సహకారం తో జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.ఇందులో భాగంగానే బీజేపీ నేతలు బుధవారం పలుచోట్ల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామని తెలిపారు.రక్తదానానికి యువత ముందుకు రావడం ఆనందంగా ఉందని రవికుమార్ వెల్లడించారు.
భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను నరేంద్ర మోడీ ప్రపంచానికి చాటుతూ, దేశ గొప్పతనాన్ని తెలియజేస్తున్నారని తెలిపారు.ఎప్పటికైనా ప్రపంచానికి విశ్వ గురువుగా భారత్ నిలవడం ఖాయమని, అది నరేంద్ర మోడీ తోనే సాధ్యమని స్పష్టం చేశారు.రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా పడకేసిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు వస్తే కాంగ్రెస్ రాష్ట్రంలో పూర్తిగా గల్లంతు అవుతుందన్న భయంతోనే స్థానిక ఎన్నికలను నిర్వహించకుండా కుంటి సాకులతో తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు.
ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా అధిక సీట్లను బిజెపి గెలుచుకోవడం ఖాయమని గంట రవి స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడం సిగ్గుచేటని రవికుమార్ ధ్వజమెత్తారు. సర్కారు చేతగాని తనంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డుపై పడిందని ఆరోపించారు. బకాయిలు చెల్లించకుంటే కళాశాలలను బంద్ చేస్తామని కళాశాలల యాజమాన్యాలు హెచ్చరిస్తున్నా డబ్బులు లేవంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడమేనని విమర్శించారు.