30-07-2025 01:15:11 AM
సంతానం లేని జంటల వద్ద లక్షల్లో వసూలు
ప్రొసీజర్ చేయకుండా వేరే పిల్లలను కొని అప్పగింత!
వెలుగులోకి ‘సృష్టి ఫెర్టిలిటీ సెంటర్’
నిర్వాహకురాలు నమ్రత భాగోతం
ఇప్పటికే ఆమెపై 12 కేసులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జులై 29 (విజయక్రాంతి): సంతానం కలగని దంపతుల ఆశలను అడ్డుపెట్టుకుని హైదరాబాదులోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత చేసిన అక్రమాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నంలో ఆమెపై ఇప్పటికే 12కు పైగా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా గోపాలపురం పోలీస్ స్టేషన్‌లోనే 2020 తర్వాత ఐదు కేసులు నమోదయ్యాయి.
ఐవీఎఫ్, సరోగసీ పేరుతో ఆమె అక్రమ దందా నడిపినట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విచారణలో డాక్టర్ నమ్రత గతంలోనూ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. 2016లోనే ఆమె రిజిస్ట్రేషన్‌ను ఐదేళ్ల పాటు రద్దు చేశారు.
అప్పట్లో ఎన్‌ఆర్‌ఐ దంపతుల ఫిర్యాదు మేరకు, సరోగసీ ద్వారా జన్మించిన శిశువుకు అసలు తల్లిదండ్రులతో జీవసంబంధమైన సంబంధం లేదని తేలడంతో ఆమెపై సరోగసీ సేవలకు జీవితకాల నిషేధం విధించారు. 2021లో రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, కోర్టు కేసుల కారణంగా ఆమె లైసెన్స్‌ను పునరుద్ధరించలేదు. అయినప్పటికీ, లైసెన్స్ లేకుండానే ఆమె తన అక్రమ కార్యకలాపాలను కొనసాగించింది.
మాతృత్వ తపనే ఆయుధం
ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాలతో ఏటా స్త్రీ, పురుషులిద్దరిలోనూ వంధ్యత్వం (ఇన్‌ఫెర్టిలిటీ) సమస్యలు పెరుగుతున్నాయి. దాదా పు ప్రతి ఆరు జంటల్లో ఒకరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ‘అమ్మానాన్న’ అనే పిలుపు కోసం ఎంత కష్టానికైనా సిద్ధపడే దంపతుల ఆశలను ఆసరాగా చేసుకుని డాక్ట ర్ నమ్రత అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తు న్నది.
సంతానంలేని జంట నుంచి లక్ష ల్లో డబ్బు వసూలు చేసి, అసలు ప్రొసీజర్ చేయకుండానే వేరే పిల్లలను తీసుకొచ్చి దంపతులకు అప్పగించి నట్లు పోలీసు లు గుర్తించారు. ఒక కేసులో దంపతుల వద్ద బాబును కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నమ్రత కు, పిల్లల అక్రమ రవాణా ముఠాలకు సంబంధం ఉందా అనే అనుమానా లకు దారితీస్తోంది. పోలీసులు ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు.
సుమోటోగా స్వీకరించిన మెడికల్ కౌన్సిల్
‘సృష్టి’ కేసు బయటపడటంతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తీవ్రంగా స్పం దించింది. ఈ ఘటనపై సుమోటోగా కేసు ను స్వీకరించి, ఎథిక్స్ కమిటీ ద్వారా విచారణకు ఆదేశించింది. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కూడా ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించి, సుమోటోగా విచారణ చేపట్టింది.
ఆగస్టు 28, 2025 నాటికి సమగ్ర నివేదికను సమర్పించాలని తెలంగాణ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. సరోగసీ కేంద్రాల్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను, పేద మహిళల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవా లని కమిషన్ డిమాండ్ చేసింది.
సృష్టి కేసు ఓ ఉదాహరణ మాత్రమే
సంతాన సాఫల్య కేంద్రాల పేరుతో జరుగుతున్న కాసుల దందా ఇప్పుడు చర్చనీ యాంశంగా మారింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంట ర్ కేసు ఈ చీకటి వ్యాపారానికి ఒక ఉదాహరణ మాత్రమేనని, ఇలాంటి అక్ర మ కార్యకలాపాలు చాలా ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లో 123 ధ్రువీకరించబడిన ఎఅర్‌టీ (అసిస్టెడ్ రిప్రొడక్టివ్) బ్యాంకులు ఉండగా, రంగారెడ్డి, మెదక్, యాదాద్రి జిల్లాలతో కలిపి మొత్తం 199 ఎఅర్‌టీ బ్యాంకులు ఉన్నాయని అధికారులు తెలిపారు.
అయితే కొందరు అక్రమా ర్కులు అండాలను సేకరించడం, సరోగసీకి ఒప్పించడం వంటివి చేస్తున్నారు. పేద మహిళలకు ఐదు నుంచి పది వేలు ఇచ్చి అండాలను సేకరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సరోగసీకి ఒకటి, రెండు లక్షలు చెల్లించిన ఘటనలు బయటపడుతున్నాయి.
సరోగసీ చట్టం ఏం చెపుతోంది?
భారతదేశంలో 2021లో ఆమోదించిన సరోగసీ నియంత్రణ చట్టం ప్రకారం వాణిజ్య సరోగసీ నిషేధించబడింది. కేవలం పరోపకార సరోగసీకి మాత్ర మే అనుమతి ఉంది. ఈ చట్టం ప్రకారం, గర్భాన్ని అద్దెకిచ్చే మహిళకు వివాహమై ఒక బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి. ఆమె ఒకసారి మాత్రమే అద్దె గర్భం ఇవ్వాలి. అది కూడా సమీప బంధువులకు మాత్రమే ఇవ్వాలి.
ప్రసవానంతరం సదరు మహిళకు 16 నెలల బీమా సౌకర్యం కల్పించాలని కూడా ఈ చట్టం చెపుతోంది. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం, అన్ని ఐవీఎఫ్ క్లినిక్‌లు, బ్యాంకులు ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి.
జాతీయ, రాష్ర్ట స్థాయిలో నిబంధనల బోర్డులు వాటిని నిత్యం పర్యవేక్షించాలి. నిబంధనలు పాటించని క్లినిక్‌లకు తొలిసారి 5 నుంచి 10 లక్షల జరిమానా, అదే తప్పు మళ్లీ చేస్తే 8 నుంచి 12 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 నుంచి 12 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.
తెలియక మోసపోతున్నారు
సృష్టి కేసు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి అక్రమ దందాలను అరికట్టడానికి, ఇతర కేంద్రా లపై కఠిన చర్యలు తీసుకోవడం, పారదర్శక నిబంధనల అమలు, సామాజిక అవగాహన పెంపొందించడం అత్యవసరం. పవిత్రమైన మాతృత్వాన్ని కాసుల దందాగా మార్చే వారిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుంది.
సంతానం కావాలను కునే దంపతుల ఆశలను ఆసరాగా చేసుకుని, చట్టవిరుద్ధంగా సులువైన మార్గాలు చూపిస్తూ కొన్ని క్లినిక్‌లు మోసాలకు పాల్పడుతున్నాయి. వా ణిజ్య సరోగసీపై భారత్‌లో నిషేధం ఉన్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే దంపతులకు ఈ నిబంధనలు తెలియక మోసపోతున్నారు.
రష్మీ పెరుమాళ్, నార్త్‌జోన్ డీసీపీ