08-09-2025 12:55:35 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్పూర్, సెప్టెంబర్ 7 :పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పాటవుతున్న నూతన కాలనీలలో భద్రతను పెంచడంలో కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపకరిస్తాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని న్యూ సాయి భగవాన్ కాలనీలో రెండు లక్షల రూపాయల సొంత నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణతో పాటు నేరగాళ్లను గుర్తించటంలో సీసీ కెమెరాలు పోలీసు శాఖకు కీలకంగా ఉపయోగపడుతున్నాయని అన్నారు. ప్రతీ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా నిరంతర నిఘాకు ఆస్కారం ఉంటుందన్నారు.
శర వేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గంలో ప్రతి గ్రామం, పట్టణం, డివిజన్లలో కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కాలనీ ప్రజల కోసం అతి త్వరలో మినీ ఫంక్షన్ హాల్, పార్కును ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సిఐ నరేష్, సీనియర్ నాయకులు మల్లేష్, బాలరాజు, ప్రమోద్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, కృష్ణ, జగదీష్, దాసు, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.