17-09-2025 11:23:27 PM
వనపర్తి,(విజయక్రాంతి): వనపర్తి జిల్లాలో యూరియా సరఫరా గత సంవత్సరం కంటే ఎక్కువ యూరియా రైతులకు సరఫరా చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వెల్లడించారు. బుధవారం ఐ.డి. ఒ.సి సమావేశ మందిరంలో దేవరకద్ర శాసన సభ్యులు జి.మధుసూదన్ రెడ్డి సమక్షంలో దేవరకద్ర నియోజకవర్గంలో భాగమైన కొత్తకోట, మాదాపూర్ మండలాల్లో ఆయా శాఖల ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు వాటి పురోగతి, ఆయా సమస్యలపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా కొత్తకోట, మదనపూర్ మండలాల్లో రైతులకు యూరియా సరఫరా పై చర్చ జరిగింది.
ఈ చర్చ సందర్భంగా యూరియా పై కలెక్టర్ వివరిస్తూ 2024 సంవత్సరం సెప్టెంబర్ 15 నాటికి వనపర్తి జిల్లాలో 13,772 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగితే ఈ సంవత్సరం ఖరీఫ్ పంటకు ఇప్పటివరకు 19,329 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందించినట్లు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పటికే 5547 మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా ఇవ్వడం జరిగింది. మదనపూర్ మండలానికి ఇప్పటి వరకు 390 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా చేస్తే కొత్తకోట మండలానికి 713 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు.