02-01-2026 12:00:00 AM
- పెండింగ్ బిల్లులు చెల్లించి గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలి
- మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ నాయకులు సిద్ధం కావాలి
- గజ్వేల్ లో విలేకరులతో ఎంపీ రఘునందన్ రావు
గజ్వేల్, జనవరి1: కొత్త సంవత్సరంలోనైనా సీఎం రేవంత్ రెడ్డి మనసు మారి పెండింగ్ బిల్లులను చెల్లించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం నూతన సంవత్సరం సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఆలయంలో ఆయన బిజెపి నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ని రోజులైనా అసెంబ్లీ నిర్వహిస్తామని, ఏ సమస్యలైనా చర్చిస్తామని, ప్రజా సమస్యలే తమకు ప్రాధాన్యత అన్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలుగా పెండింగ్ బిల్లుల చెల్లించడంలో విఫలమయ్యారన్నారు.
రాష్ట్ర ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. మన ఊరు - మనబడి లో భాగంగా నిర్మాణం చేసిన విద్యా కమిటీ చైర్మన్ ల సమస్యలను తీర్చలేదన్నారు. గత రెండు సంవత్సరాలుగా గ్రామాల్లో మాజీ సర్పంచులు రకరకాల సమస్యలతో వేతన అనుభవిస్తున్నారని, నూతన ఆంగ్ల సంవత్సరం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసు కరిగి వారి సమస్యలను తీర్చాలన్నారు. మన ఊరు - మనబడి భవనాల నిర్మాణం చేసిన వారికి వెంటనే బిల్లులు చెల్లించాలన్నారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్, మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ తదితరులు ఉన్నారు.