08-11-2025 12:48:07 AM
హాజరైన ఆర్డీవో దేవుజా
జహీరాబాద్, నవంబరు 7 :ప్రమాదాలు జరగకుండా ప్రజల ప్రాణాలు కా పాడాలని భగవంతుని ప్రార్థిస్తూ మృ త్యుంజయ మహా యజ్ఞం నిర్వహించా రు. ఝరాసంగం మండలంలో గల బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో శుక్రవారం మృత్యుంజయ యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతి 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ ఆధ్వర్యంలో ఈ మహా యజ్ఞం నిర్వహించారు.
ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీని ద్వారా అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా భగవంతుడే కాపాడాలని ఆకాంక్షిస్తూ యజ్ఞాన్ని నిర్వహించారు. ఇటీవల జరిగిన టిప్పర్, బస్సు ప్రమాదంతో పాటు ఇతర ప్రాంతాలలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో మహా మృత్యుంజయ యజ్ఞం నిర్వహించినట్లు ఆశ్రమ భావి పీఠాధిపతి డాక్టర్ సిద్దేశ్వర నందగిరి మహారాజ్ తెలిపారు.
విశ్వంలో మానవులంతా సమానమేనని విశ్వమానవ ధర్మ ప్రచారం కోసం ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి దేవుజా హాజరై పూర్ణాహుతి గావించారు. కార్యక్రమంలో తహసిల్దార్ తిరుమలరావు, శివశక్తి జాతీయ ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు ఠాకూర్ శివకుమార్, మాలిపట్లోల శ్యామ్ రావు పటేల్, వివిధ మండలాల చెందిన భక్తులు పాల్గొన్నారు.