16-09-2025 12:04:46 AM
రామచంద్రాపురం, సెప్టెంబర్ 15 :ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రామచంద్రాపురం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు ప్రమోద్ మాదిగ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పింఛన్ దారులందరికీ పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారని, అయితే ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడిచినా ఆ హామీ నెరవేర్చక ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులు, చేయూత పొందుతున్న పెన్షనుదారులు, ఒంటరి మహిళలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టే పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు. వెంటనే పింఛన్లను పెంచి అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు ఎమ్మార్పీఎస్ నాయకులు, వికలాంగులు, పెన్షనుదారులు, మహిళలు పాల్గొన్నారు.