23-09-2025 11:37:06 PM
* బేకరీల్లోనూ కెమికల్ ఫుడ్ పదార్థాలు
* హుస్నాబాద్‌లో మున్సిపల్ అధికారుల దాడులు
* కుళ్లిపోయిన ఆహారం, ప్లాస్టిక్ వాడుక బహిర్గతం
* పరిశుభ్రత పాటించని యజమానులకు జరిమానా
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం ఆహార భద్రతా తనిఖీలు కలకలం రేపాయి. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో పట్టణంలోని హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం, పరిశుభ్రత లోపాలు బహిర్గతమయ్యాయి. మైసూర్ బేకరీకి రూ.1,000, వీనస్ మెస్కి రూ.1,000, బావర్చి రెస్టారెంట్కు రూ.10 వేలు, దావత్ రెస్టారెంట్కు రూ.20 వేలు, మస్తీ కిచెన్స్కు రూ.5 వేలు, స్వాగత్ రెస్టారెంట్కు రూ.2 వేలు, రాజు గారి బిర్యానీకి రూ.10 వేలు, రిషి బిర్యానీ సెంటర్కు రూ.2 వేలు జరిమానా విధించారు. మొత్తంగా రూ.51 వేలు వసూలు చేశారు.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం హోటళ్లు, బేకరీలు పాటించాల్సిన ప్రాథమిక నిబంధనలు ఎక్కడా కనిపించలేదు. తాజా ఆహార పదార్థాల వినియోగం లేదు. వంటగదులు శుభ్రంగా ఉంచడంలేదు. కుకింగ్ స్టాఫ్ గ్లోవ్స్-ఏప్రాన్ ధరించకపోవడం, గడువు ముగిసిన ఫుడ్ స్టాక్ తొలగించకపోవడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఉన్నా యథేచ్ఛగా వాడడం, వ్యర్థాల తొలగింపులో శాస్త్రీయ విధానం పాటించకపోవడం కనిపించింది. దీంతో మొదటి హెచ్చరికగా జరిమానా విధించినట్టు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, పర్యావరణ అధికారి రవికుమార్, బిల్ కలెక్టర్ సతీశ్, జవాన్లు సారయ్య, ప్రభాకర్తో పాటు సిబ్బంది శేఖర్, వనాకర్, సాగర్ పాల్గొన్నారు.
ప్రజల జాగ్రత్తలు
హోటల్, బేకరీలో ఆహారం తినే ముందు పరిశుభ్రత గమనించాలి.
పాడైపోయిన ఆహారం ఇస్తే వెంటనే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయాలి.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని వ్యతిరేకించాలి.
ఆరోగ్య భద్రత కోసం విశ్వసనీయమైన కేంద్రాలకే వెళ్లాలి.