12-09-2025 12:18:19 AM
- మున్సిపల్ జనరల్ ఫండ్ డబ్బులను ఇతర వాటికి తరలింపు
- సిఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్
సదాశివపేట, సెప్టెంబర్ 11 : సదాశివపేట మున్సిపాలిటీలో మున్సిపల్ కార్మికులకు రెండు నెలల జీతాలు తక్షణమే ఇవ్వాలని, కార్మికుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఇతర వాటికి ఖర్చుపెట్టిన వారిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
మూడవరోజు మున్సిపల్ కార్యాలయం ముందు జీతాలు రాకపోవడంతో చె ట్లు ఆకులు తింటూ నిరసన తెలిపారు. సదాశివపేట మున్సిపాలిటీలో ఈ సంవత్సరం మున్సిపాలిటీకి ఆదాయం 4 కోట్ల రూపాయలు వచ్చినట్లు అధికారులు ప్రకటన చేశారు. ఈ వచ్చిన డబ్బులు అన్ని జనరల్ ఫండ్లో జమ చేయడం జరిగింది అని అన్నారు, ఈ జనరల్ ఫండ్ ద్వారా కార్మికులకు ప్రతినెల జీతాలు ఇవ్వాలని నిబంధన ఉన్నా అమలు కావడం లేదని, ఈ జనరల్ ఫండ్ ద్వారా వచ్చిన డబ్బులను మున్సిపాలిటీలో ఇతర అభివృద్ధి కోసం నిధులు ఖర్చు చే యడం దుర్మార్గమన్నారు.
కార్మికులకు జీతాలు రాక పస్తులుంటే ఇతర అవసరాల కోసం ఈ డబ్బు ఖర్చు చేశారంటే ఇందులో ఏదో మతలబు ఉందని జిల్లాస్థాయి అధికారులు తక్షణమే స్పందించి ఈ జనరల్ ఫండ్ నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారు వాటిపై సమగ్ర విచారణ జరిపి వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు ఏ.అంజయ్య శ్రీనివాస్, నగేష్, చుక్కల రవికుమార్, బాలరాజ్, పవన్ నర్సింలు కృష్ణ గణేష్ మాణిక్యం రుక్కమ్మ లలిత శ్యామమ్మ లక్ష్మి అమృతమ్మ సుజాత తదితరులు పాల్గొన్నారు.