03-01-2026 09:08:34 PM
బేల,(విజయక్రాంతి): హిందూ... ముస్లిం ఐక్యతకు అద్దం పట్టే ఘటన ఇది. ముస్లిం సోదరులు అయ్యప్ప మాలధారులకు భిక్షను ఏర్పాటు చేసి ఇతర మతాలపై తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు. అయ్యప్ప స్వాములను ఆహ్వానించి అన్నదానం చేశారు. వివిధ రకాల వంటకాలు తయారు చేసి భక్తితో వారికీ వడ్డించారు. మత సామరస్యం వెల్లివెరిసిన ఈ ఘటన బేల మండలంలోని చెప్రాల గ్రామంలో జరిగింది.
ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ మాట్లాడుతూ తన మతంతో పాటు ఇతర మతాలను కూడా గౌరవిస్తూ హిందూ-ముస్లింల ఐక్యతను కోరుకుంటునమన్నారు. భగవంతుని దృష్టిలో అందరూ సమానమేనని, హిందూ,ముస్లింలు కలిసిమెలిసి మెలగాలన్నదే తన అభిమతమని అందుకే భిక్షను ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ కుల, మతాలకు అతీతంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ క్రమంలోనే అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయాలనే ఆలోచనతో ముస్లిం సోదరులు కలిసి వివిధ గ్రామాలకు చెందిన 25 మంది అయ్యప్ప స్వాములకు విందు ఏర్పాటు చేశామన్నారు. తన మతంపై ప్రేమ ఉందని, అదే సమయంలో ఇతర మతాలపైనా గౌరవం ఉందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే మతసామరస్యాన్ని చాటిచెప్పేందుకు వివిధ కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు.