22-11-2025 10:06:51 PM
మెట్‌పల్లి,(విజయక్రాంతి): ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం వెంటనే తెరిపించాలని, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజి రెడ్డి అన్నారు. శనివారం మెట్ పల్లి పట్టణ బిజెపి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మూతపడ్డ ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా హామీ ఇచ్చిన ప్రకారం తెరిపించకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ రైతులను మోసం చేస్తుందని అన్నారు. ఇక్కడి చెరుకు రైతులు వంద కిలోమీటర్లు దూరంలోని కామారెడ్డి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి చెరకు పంపిస్తున్నారని తద్వారా రవాణా భారం రైతు పైన పడుతుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీని తెరిపించాలి ఫ్యాక్టరీ తెరిపించే వరకు రవాణా భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని పేర్కొన్నారు. అదేవిధంగా వరంగల్ రైతు డిక్లరేషన్ సమయంలో చెరుకు రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో వివిధ రాష్ట్రాల్లో మూతపడ్డ దాదాపు రెండు వందల షుగర్ ఫ్యాక్టరీ లను తెరిపించడం జరిగిందని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వల్ల చేతకాకుంటే కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాసినట్లయితే మూతపడ్డ మూడు షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించే బాధ్యత బిజెపి తీసుకుంటుందని తెలియజేశారు.