calender_icon.png 4 December, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద కుటుంబాల్లో వెలుగులు నింపే బాస నాది

04-12-2025 12:35:28 AM

  1. రాబోయే రెండున్నరేండ్లలో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం
  2. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తిజేసే బాధ్యత మాదే
  3. బీఆర్‌ఎస్ కట్టిన కాళేశ్వరం పదేండ్లకే కూలింది
  4. హుస్నాబాద్‌ను ఎండబెట్టి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కు నిధుల వరద.. 
  5. మంత్రుల దగ్గర కూర్చొని నిధులు తీసుకెళ్లెటోళ్లనే సర్పంచులుగా ఎన్నుకోండి
  6. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి

సిద్దిపేట, డిసెంబర్ 3 (విజయక్రాంతి)/హుస్నాబాద్: ‘రాబోయే రెండున్నరేండ్లలో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేసి, మొత్తం లక్ష ఉద్యోగాలు ఇస్తాం. పేద కుటుంబాల్లో వెలుగులు నింపే బాస నాది. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తిజేసే బాధ్యత మాదే’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు ఈనాటికీ చెక్కుచెదరకుండా ఉంటే, బీఆర్‌ఎస్ హయాంలో లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పదేండ్లు కాకముందే కూలిందని విమర్శించారు. తెలంగాణ పచ్చదనానికి, నీటి అవసరాలకు కాంగ్రెస్ పాలకుల దూరదృష్టితో కట్టిన ప్రాజెక్టులే ఆధారం అని స్పష్టం చేశారు. పదేండ్లలోనూ పూర్తి చేయలేని గండిపల్లి, గౌరవెల్లి ప్రాజెక్టుల పూర్తి బాధ్యత తమ ప్రభుత్వానిదేనని హామీ ఇచారు.

హుస్నాబాద్‌ను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని, ఇక్కడ కేవలం సెంటిమెంటును మాత్రమే వాడుకున్నారని ఆరోపించారు. ‘మేము గత పాలకుల్లా కాదు. ఎన్ని నిధులు కావాలన్నా ఖర్చు పెట్టి, హుస్నాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి, ఈ ప్రాంతానికి జరిగిన ద్రోహాన్ని చెరిపేస్తాం‘ అని స్పష్టం చేశారు.

హుస్నాబాద్ ప్రాంతానికి చారిత్రక గుర్తింపు ఉందని, ఇది సర్దార్ సర్వాయి పాపన్న నేతృత్వంలో బహుజన రాజ్యానికి పునాదులు వేసిన గడ్డ అని కొనియాడారు. ‘గత పాలకులు గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లను మాత్రమే అభివృద్ధి చేసుకున్నారు. హుస్నాబాద్‌ను నిర్లక్ష్యం చేశారు. కానీ, ఈ ప్రజా ప్రభుత్వం హుస్నాబాద్‌ను నిర్లక్ష్యం చేయదు. ఎన్ని నిధులైనా ఖర్చు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం’ అని హామీ ఇచ్చారు.

డిసెంబర్ 3.. సెలబ్రేషన్ ఆఫ్ డెమోక్రసీ 

డిసెంబర్ 3 వ తేదీకి ఉన్న ప్రాముఖ్యతను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ‘మీరు మీ ఓటును ఆయుధంగా మార్చి, దుర్మార్గ పాలనను అంతమొందించి, ప్రజా పాలనను తీసుకొచ్చిన రోజు ఇది. తెలంగాణ కోసం శ్రీకాంతాచారి అమరుడైన రోజు ఇది’ అని పేర్కొన్నారు. మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ‘రాబోయే రెండున్నరేం డ్లలోమరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేసి, మొత్తం లక్ష ఉద్యోగాలు ఇస్తాం. పేద కుటుంబాల్లో వెలుగులు నింపే బాస నాది’ అని యువతకు భరోసా ఇచ్చారు.

బీఆర్‌ఎస్ పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్రూం కూడా ఇవ్వలేదని విమర్శిస్తూ, తమ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టిస్తామని కీలక వాగ్దానం చేశారు. ‘మంత్రుల దగ్గర కూర్చొని, నిధులు తీసుకెళ్లేటోళ్లను, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసి గ్రామాలు అభివృద్ధి చేసే మంచివారిని సర్పంచులుగా ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తద్వారా స్థానిక, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధిని వేగవంతం చేయాలని కోరారు.