12-09-2025 12:00:00 AM
ప్రగతి భవన్ లో వినతి పత్రం అందజేత
గల్ఫ్ బాధితుడు రాజమల్లు
ముస్తాబాద్, సెప్టెంబర్ 11( విజయ క్రాంతి )పదేళ్ల శ్రమ ఫలితం 21,500 సౌదీ రియాళ్ళు (సుమారు రూ.5 లక్షలు) బ్యాంక్ లో చిక్కుకున్నాయి.,గల్ఫ్ జేఏసీ జనాయకుడు తోట ధర్మేందర్ తెలిపిన వివరాల ప్రకారం. రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం, తెర్లుమద్ది గ్రామానికి చెందిన రాగం రాజమల్లు సౌదీ అరేబియా దేశం అభా పట్టణ సమీపంలోని అల్-హరాజా మున్సిపాలిటీలో 2014 నుంచి 2025 వరకు 10 సంవత్సరాల పాటు క్లీనర్ గా పనిచేశాడు.
రాజమల్లు పనిచేసిన పదేళ్ల కాలానికి సంబంధించిన ’ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్’ (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) 21,500 సౌదీ రియాళ్ళు (సుమారు రూ.5 లక్షలు) సొమ్మును యాజమాన్యం సౌదీ లోని అతని బ్యాంకు ఖాతాలో జమ చేసింది.
డబ్బు ను అకౌంట్ నుంచి తీసుకునే లోగానే అతన్ని ఫిబ్రవరి 12న ఇండియాకు పంపించేశారు.’సౌదీ నేషనల్ బ్యాంక్’ లోని తన ఖాతాలో ఉన్న సొమ్మును ఇండియాలోని తన బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించాలని లరాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ద్వారా అందించాలని కోరుతూ రాజమల్లు హైదరాబాద్, బేగంపేట ప్రజాభవన్ లో ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ లో మంగళవారం (09.09.2025) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు.
తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, గల్ఫ్ జెఏసి నాయకుడు తోట ధర్మేందర్ లు అతనికి అండగా నిలిచి ధైర్యం చెప్పారు.డబ్బును సౌదీ బ్యాంక్ నుంచి భారత్ కు బదిలీ చేయించడానికి, తమ కంపెనీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్వో), పాకిస్థాన్ జాతీయుడైన మహమ్మద్ బిలాల్ కు ’పవర్ ఆఫ్ అటార్నీ’ ఇచ్చానని రాజమల్లు తెలిపారు.తన సమస్యను జిద్దా లోని ఇండియన్ కాన్సులేట్ (భారత దౌత్య కార్యాలయం) దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.