29-10-2025 06:56:57 PM
▪️రక్తదానం చేసిన రోజునే ప్రాణదానం చేసిన ఎస్సై భార్గవ్ గౌడ్
▪️గాయపడిన వ్యక్తికి జీవదాతగా మారిన ఎస్సై
▪️ క్షతగాత్రుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ప్రాణం కాపాడిన ప్రాణదాత
▪️అమరవీరుల స్ఫూర్తితో మానవత్వం చాటుకున్న భార్గవ్ గౌడ్
▪️సేవా మనసుతో ప్రజల మనసు గెలిచిన ఎస్సై భార్గవ్ గౌడ్
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): మానవతా విలువలకు ప్రతీకగా నిలిచిన నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్ గౌడ్ ఆదర్శంగా నిలిచారు. ఎల్లారెడ్డి పట్టణంలోని దేవనపల్లి గేటు సమీపంలో బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహన దారుడు ప్రమాదవశాత్తు కిందపడి, తలకు తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావంతో నిస్సహాయంగా పడి ఉన్న వ్యక్తిని గమనించిన ఎస్సై భార్గవ్ గౌడ్, క్షణం కూడా ఆలస్యం చేయకుండా తాను ప్రయాణిస్తున్న పోలీస్ ప్రభుత్వ వాహనాన్ని ఆపి, స్థానికుల సహకారంతో బాధితుడిని స్వయంగా వాహనంలో ఎక్కించుకుని హుటాహుటిన ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే చికిత్స అందించడంతో బాధితుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
అదే రోజు ఉదయం పోలీస్ అమరవీరుల స్ఫూర్తితో... జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి పట్టణంలోని ముత్యపు రాఘవ కళ్యాణ మండపంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఎస్సై భార్గవ్ గౌడ్ స్వయంగా రక్తదానం చేశారు. అనంతరం తిరిగి నాగిరెడ్డిపేట మండలానికి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై భార్గవ్ గౌడ్ చూపిన మానవతా ధోరణి, సేవా స్పూర్తి ప్రజల ప్రశంసలు పొందుతోంది. రక్తదానం ద్వారా జీవదానం చేసిన ఆయన, మరొకరి ప్రాణం కాపాడి నిజమైన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ప్రజలు ఆయన చేసిన ఈ మానవతా చర్యను అభినందిస్తూ “ఇలాంటి అధికారులు పోలీస్ విభాగానికి గర్వకారణం” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.