10-08-2024 12:00:00 AM
పేరు తెచ్చిన చిన్న వివాదం చినికి చినికి గాలివానగా మారి పెద్దల సభలో శుక్రవారం ప్రతిపక్షాల వాకౌట్‌కు దారి తీసింది. రాజ్యసభ చైర్మన్ ధన్‌కర్ సమాజ్‌వాది పార్టీ సీనియర్ ఎంపీ జయాబచ్చన్‌ను ‘జయా అమితాబ్ బచ్చన్’గా మరోసారి సంబోధించడం ఈ వివాదానికి కారణం. తన పేరులో అమితాబ్‌ను చేర్చి పిలవడంపై ఆమె తీవ్ర అభ్యంతరం చెప్పారు. దీనిపై ధన్‌కర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నాకు పాఠాలు చెప్పొద్దు. కూర్చోండి’ అంటూ తీవ్రంగా స్పందించారు. తాను నటినని బాడీ లాంగ్వేజ్, మాటతీరు గురించి తనకు బాగా తెలుసునని జయ చేసిన వ్యాఖ్య లు ధన్‌కర్‌కు మరింత ఆగ్రహం తెప్పించాయి. ‘మీరు సెలబ్రిటీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. నటులు ఎవరైనా డైరెక్టర్ చెప్పినట్లుగా నడుచుకోవాలి.
మీరూ అంతే. చైర్మన్ మాట విని తీరాలి’ అన్న రీతిలో మాట్లాడారు. దానితో చైర్మన్ క్షమాపణ చెప్పాలని జయాబచ్చన్ డిమాండ్ చేయడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ దశలో ప్రతిపక్షనాయకుడు మల్లికార్జున ఖర్గే లేచి మాట్లాడబోగా, ఆయన మైక్ కట్ చేయడం ప్రతిపక్షాలకు మరింత ఆగ్రహం తెప్పించింది. చైర్మన్ వైఖరిని నిరసిస్తూ సోనియా నాయకత్వంలో మొత్తం ప్రతిపక్షం వాకౌట్ చేసింది. ఈ వ్యవహారంపై పార్లమెంటు బయట జయాబచ్చన్ మీడియాతో మాట్లాడారు. చైర్మన్ ఉపయోగించిన స్వరాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాని అన్నారు.
తామేమీ స్కూలు పిల్ల లం కాదని, తమలో కొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారన్నారు. ప్రతిపక్షనేత మాట్లాడేందుకు నిల్చున్న సమయంలో ఆయన మైక్‌ను కట్ చేశారు. అలా ఎలా ప్రవర్తిస్తారు? మీరు సెలబ్రిటీ అయితే ఏంటి, నేను పట్టించుకోనంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారన్నారు. తాను అయిదోసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని, ఎలా మాట్లాడాలో తనకు తెలియదా అని కూడా అన్నారు. ఇలాంటి ప్రవర్తన గతంలో ఎన్నడూ చూడలేదంటూ చైర్మన్ క్షమాపణ చెప్పి తీరాలన్నారు.
అయితే, జయాబచ్చన్ తన పేరు విషయంలో అభ్యంతరం చెప్పడం ఇది మొదటిసారి కాదు. ఇటీవల రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ‘జయా అమితాబ్ బచ్చన్’ మాట్లాడాలంటూ ఆహ్వానించారు. దీనికి ఆమె అభ్యంతరం చెప్పారు. ‘జయాబచ్చన్ అంటే సరిపోతుంది’ అం టూ వ్యాఖ్యానించారు. రికార్డుల్లో మీ పేరు అలానే ఉందంటూ హరివంశ్ చెప్పగా ‘మహిళలకు స్వతహాగా గుర్తింపు లేదా?’ అంటూ ఆ రోజే జయాబచ్చన్ అసహనం వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే రాజ్యసభ చైర్మన్ ధన్‌కర్ కూడా అలాగే పిలవడంతో మరోసారి జయాబచ్చన్ అభ్యంతరం చెప్పారు.
అయితే, ఎన్నికల సర్టిఫికెట్‌లో పేరు మార్చుకోవడానికి వీలుందని, అలా చేయండంటూ ధన్‌కర్ ఆమెకు సలహా ఇచ్చారు. పార్లమెంటులో కొత్త డ్రామా మొదలైందంటూ దీనిపై ఆమె మరోసారి ఘాటుగా ప్రతిస్పందించారు. తన పేరును జయాబచ్చన్‌గా పిలవాలని తాను చెప్పినా పట్టిం చుకోకపోడం ఆమెకు ఆగ్రహాన్ని తెప్పించినట్లు కనిపిస్తున్నది. జయాబచ్చన్ ఎవరో ధన్‌కర్‌కు తెలియంది కాదు. అంతేకాదు, తన ను జయాబచ్చన్‌గా పిలవాలని ఆమే స్వయంగా కోరినప్పుడు అభ్యంతరం ఎందుకో అర్థం కావడం లేదు. ఇది తన ఆత్మగౌరవానికి సంబంధించిన అం శంగా జయాబచ్చన్ భావించడమే సమస్య తీవ్రం కావడానికి కారణం.
ఈ నేపథ్యంలో గతంలో జయాబచ్చన్ కోడలు, నటి ఐశ్వర్యారాయ్ ఓ ఇంటర్వ్యూలో తన పేరుకు బచ్చన్‌ను చేర్చడంపై అభ్యంతరం చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ధన్‌కర్ వ్యవహార శైలి వివాదాస్పదం కావ డం ఇది మొదలు కాదు. గతంలో ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నప్పుడు సీఎం మమతా బెనర్జీకి, ఆయనకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండేది. ఆయన రాజ్యసభకు నామినేట్ కావడంతో ఆ వివాదానికి తెరపడింది. రాజ్యసభ చైర్మన్‌గా కూడా ధన్‌కర్ వ్యవహార శైలిపై ప్రతిపక్షాలు అనేక సందర్భాల్లో తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి కూడా. ప్రతిపక్షనాయకుడు మల్లికార్జున ఖర్గేకు, ఆయనకు మధ్య అనేకసార్లు మాటల యుద్ధం కూడా జరిగింది. ఇప్పుడు ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.