29-08-2024 12:00:00 AM
మాటల రచయిత నడిమింటి నర్సింగరావు (72) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. నర్సింగరావుకు భార్య, కుమార్తె ఉన్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘గులాబి’, రామ్‌గోపాల్‌వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ‘అనగనగా ఒకరోజు’ సినిమాలతోపాటు పలు తెలుగు చిత్రాలకు ఆయన మాటలు అందించారు. ‘పాతబస్తీ’, ‘ఊరికి మొనగాడు’, ‘కుచ్చికుచ్చి కూనమ్మా’ వంటి సినిమాలకు కూడా నరసింగరావు మాటల రచయితగా పనిచేశారు.
అయితే సినిమాల్లోకి రాక ముందు ‘బొమ్మలాట’ అనే నాటకం ద్వారా ఆయన గుర్తింపు పొందారు. వెండితెరపైనే కాకుండా ఇటు బుల్లితెరపై కూడా నరసింగరావు తనదైన ముద్ర వేశారు. ఒకప్పుడు దూరదర్శన్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘తెనాలి రామకృష్ణ’ సీరియల్‌కు కూడా ఆయనే మాటల రచయిత. ఈటీవీలో ప్రసారమైన ‘వండర్ బాయ్’, ‘లేడీ డిటెక్టివ్’, ‘అంతరంగాలు’ వంటి సీరియల్స్‌కు మాటలు రాశారు. ఆయన డైలాగ్స్ రాసిన వాటిల్లో ‘అంతరంగాలు’ ప్రత్యేకమైంది. ఆ సీరియల్ కోసం నర్సింగరావు రాసిన డైలాగ్స్ ఇప్పటికీ గుండెల్ని పిండేస్తాయి. నర్సింగరావు మరణ వార్త ఇటు వెండితెరతోపాటు అటు టీవీ సెలబ్రెటీలను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది.