15-08-2025 01:21:51 AM
బీజేపీ కార్యకర్తలు సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): గత రెండురోజులుగా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారికి అండగా నిలిచేందుకు కేంద్రం కృషి చేస్తున్నట్టు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించేందుకు కేంద్రప్రభుత్వ ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ముమ్మరంగా ముందుంటున్నాయని, వారికి తోడుగా బీజేపీ కార్యకర్తలు కూడా ఈ సహాయక కార్యక్రమాల్లో ప్రజలకు అండగా నిలుస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
వరదముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి కావాల్సిన ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించాలని రాష్ర్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీనియర్ ప్రభుత్వాధికారులను వరద ప్రభావిత ప్రాంతాల సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు తక్షణమే పంపించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధిత ప్రజలకు సహాయమందించేందుకు కేంద్ర హోంమంత్రి ఆదేశాలతో ఇప్పటికే 7 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్‌ఎఫ్) బృందాలను తెలగాణ ప్రభుత్వ సూచన మేరకు రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వ యంత్రాంగం కలిసి పాల్గొంటున్నాయన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు బృందాలు, ఖమ్మం, నిర్మల్, ములుగు, హైదరాబాద్, మహబూబాబాద్‌లో ఒక్కో బృందం చొప్పున ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మరో రెండ్రోజులపాటు భారీ వర్షసూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. ఆయా జిల్లాల్లోని నదులు, వాగుల అంచున ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.