17-11-2025 12:30:00 AM
అమరావతి, నవంబర్ 16: దేశంలో ప్రతి విద్యార్థీ భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఏపీలోని మంగళగిరి పట్టణంలో రాజ్యాంగ విలువలపై సదస్సు నిర్వహించింది.
ఈ సదస్సుకు సీజేఐ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. రాజ్యాంగాన్ని శాశ్వతమైన డాక్యుమెంట్ అని అంబేడ్కర్ భావించలేదని, దేశ పౌరుల అవసరాలకు అనుగుణంగా రూపాంతరం చెందాలని ఆకాంక్షించారని గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని సవరించేందుకు అంబేడ్కర్ ఆర్టికల్ 368 కల్పించారని తెలిపారు. రాజ్యాంగ సవరణ అంశంపై కేంద్రానికి, సుప్రీంకోర్టుకు మొదట్లో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడిందని, కేశవానంద భారతి కేసులో రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని సవరించరాదని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు.
1975 వరకు ఆదేశిక సూత్రాల కంటే ప్రాథమిక హక్కులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేదని, కేశవానంద భారతి కేసు తర్వాత ప్రాథమిక హక్కులతో పాటు ఆదేశిక సూత్రాలకూ సమ ప్రాధాన్యం దక్కిందని పేర్కొన్నారు. రాజ్యాంగ ముసాయిదా సమర్పించిన సందర్భంగా చేసిన అంబేడ్కర్ చేసిన ప్రసంగాలు ప్రతి న్యాయ విద్యార్థి వినాలని సూచించారు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం భారత రాజ్యాంగం ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు.
ప్రతి దేశ పౌరుడూ స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు పొందాలని అంబేడ్కర్ ఆకాంక్షించారని కొనియాడారు. కేవలం రాజ్యాంగం వల్లనే ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇద్దరు వ్యక్తులు దేశానికి రాష్ట్రపతి అయ్యారని, అలాగే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళ రాష్ట్రపతి అయ్యారని తెలిపారు. తాను తన స్వస్థలమైన అమరావతిలో ఒక సాధారణ మునిసిపల్ పాఠశాలలో చదువుకున్నానని, ఉన్నత స్థాయికి ఎదగాలనే కాంక్షతో ఉన్నత విద్య అభ్యసించానని వివరించారు. తాను భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాన్ని కూడా రాజ్యాంగమే ఇచ్చిందని కొనియాడారు.
ఎస్సీ రిజర్వేషన్లలో ‘క్రీమీ లేయర్’ ఉండాలనేది తన అభిప్రాయమని ఉద్ఘాటించారు. ఇతర వెనుకబడిన తరగతులకు వర్తిస్తున్న విధంగానే ఎస్సీలకూ క్రీమీలేయర్ వర్తింపజేయాలని అభిప్రాయపడ్డారు. ఇంద్ర సాహ్నీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పులో పేర్కొన్న క్రీమీ లేయర్ అంశాన్ని ఎస్సీలకు కూడా అమలు చేయాలన్న తీర్పుపై అనే విమర్శలున్న విషయం వాస్తవమేనని కండబద్దలు కొట్టారు.
ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై వివక్ష ఉండరాదని విశాఖ కేసు తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని, కొన్నేళ్లుగా మహిళలు న్యాయ విద్యలో బాగా రాణిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల ప్రజలకు అవగాహన ఉండాలని సీజేఐ అభిప్రాయపడ్డారు.