calender_icon.png 22 November, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'అమ్మ'కాలే.. కొను'గోల్'

17-08-2024 03:40:23 PM

జగిత్యాల,(విజయక్రాంతి): పెళ్ళై ఐదు, పదేళ్లు అయినా "అమ్మ"కాలే.. పిల్లల కోసం తిరుగని ఆసుపత్రి లేదు.. కలువని వైద్యులు లేరు.. వాడని మందులు లేవు.. కానీ ఫలితం లేకపోవడంతో చేసేది ఏమీ లేక ఆలయాలు తిరిగి ఎక్కరాని మెట్టు ఎక్కి మొక్కని దేవుళ్ళను మొక్కారు. చివరకు  లక్షలు పెట్టి గుట్టుగా పిల్లలను కొను'గోల్' చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడికావడంతో కేసు సరికొత్త మలుపు తిరుగుతుంది. రెండేళ్ళ బాలుడితో పాటు మరో ఇద్దరి పిల్లలను అపహరించిన కిడ్నాప్ ముఠా సంతానం లేని దంపతులు పిల్లల కోసం పరితపిస్తున్నారని తెలుసుకొని సంపా"ధన"గా మలుచు"కొంటున్న" కిడ్నాప్ ముఠా గుట్టురట్టయింది.

వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో రెండేళ్ల బాలుడిని అపహరించిన అగంతకుల పట్టుకోవడంతో కిడ్నాప్ కేసు కథ సుఖాంతమైందని అంతా భావించారు. కానీ రెండేళ్ళ బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితులను పోలీసులు విచారిస్తున్న సమయంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మెట్ పల్లిలో రెండేళ్ళ బాలున్ని కిడ్నాప్ చేసిన నిందితుడు ఇస్లావత్ నగేష్, అతని భార్య లావణ్య మూడు నెలల్లోనే ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేసి ఇద్దరిని జూన్ లో అమ్మినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఈ నెల 13వ తేదీన రెండేళ్ళ బాలుడిని కిడ్నాప్ చేసి రూ 1.50 లక్షలకు విక్రయానికి ఒప్పందం చేసుకొని దొరికిన విషయం తెలిసిందే. కాగా జూన్ మాసంలో ఆరేళ్ల బాలికను మేడిపల్లి మండలం పోరుమల్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి రూ.2 లక్షలు, మూడేళ్ల బాలికను మెట్ పల్లి పట్టణం హనుమాన్ నగర్ కు చెందిన ఓ వ్యక్తికి రూ.1.50 లక్షలకు అమ్మినట్లు పోలీసులు తెలిపారు. మరింత లోతుగా సమగ్ర విచారణ జరిపితే పూర్తి స్థాయి లోగుట్టు రాబట్టాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు తమదైన స్టైల్లో కిడ్నాప్ ముఠాను పోలీస్ విచారిస్తున్నట్లు సమాచారం.