14-10-2025 12:24:26 AM
పాలమూరు ఎంపీ డీకే అరుణ
గద్వాల టౌన్, అక్టోబర్ 13 : రైతుల ఆదాయం పెంచేందుకు ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రారంభించినట్లు మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యు రాలు డీకే అరుణ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ పథకం కింద దేశవ్యాప్తంగా వంద జిల్లాలు ఎంపిక చేయగా తెలంగాణ రాష్ట్రంలో ౪ జిల్లాలకు అవకాశం వచ్చిందని దానిలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు జిల్లాలు ఎంపిక కావడం వీటిలో గద్వాల జిల్లా ఉండటం శుభ పరిణామమని తెలిపారు.
మొదటి విడతలో రూ . 960 కోట్లు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. రైతులకు సులభతర రుణాలు, నీటిపారుదల సౌకర్యాలు మెరుగుదల ప్రధాన లక్ష్యమని రైతులు పాడి పశువులు, గొర్రెల కోళ్ల పెంపకంపై దృష్టి పెట్టాలన్నారు . వ్యవసాయ ఉత్పాదక నీటిపారుదల రుణ సౌకర్యాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఈ పథకం ఆరు సంవత్సరాలు కొనసాగుతుందని తెలిపారు.
రైతుల అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని కేంద్ర వ్యవసాయ మంత్రి చౌహన్ సింగ్ దూర దృష్టితో ఈ పథకానికి పురుడు పోశారని తెలిపారు .రైతుల ఆదాయం పెంపు దిశగా కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే అభివృద్ధి దేశంగా ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు జిల్లా బిజెపి నాయకులు పాల్గొన్నారు.