calender_icon.png 23 December, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొలువుకెక్కిన కొత్త సర్పంచులు

23-12-2025 12:13:41 AM

అట్టహాసంగా ప్రమాణ స్వీకారం 

మహబూబాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. రెండు సంవత్సరాల నుండి ప్రత్యేక అధికారుల పాలన సాగగా, కొత్త సర్పంచ్లు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రత్యేక అధికారుల పాలనకు తెరపడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన 1,684 గ్రామాల్లో సర్పంచులు బాధ్యతలను స్వీకరించారు. ఆయా గ్రామాల్లో ప్రత్యేక అధికారులు కొత్తగా ఎన్నికైన సర్పంచుల చేత పదవీ స్వీకార ప్రమాణం చేయించి, బాధ్యతలు అప్పగించారు.

చాలా గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు పదవి బాధ్యతల స్వీకారోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా అట్టహాసంగా నిర్వహించారు. పంచాయతీ కార్యాలయాలకు కొన్నిచోట్ల సొంతంగా రంగులు వేయించి అందంగా ముస్తాబు చేయించారు. గ్రామపంచాయతీ ఆవరణలో పెద్ద షామియాను వేసి ప్రమాణ స్వీకార వేడుకలను వైభవంగా నిర్వహించారు. పంచాయతీల్లో సర్పంచిన పదవి స్వీకార కార్యక్రమం పండగ వాతావరణాన్ని తలపించింది.

సర్పంచ్ అను నేను అంటూ గ్రామాభివృద్ధికి నిష్పక్షపాతంగా, భయాందోళన లేకుండా ప్రజలందరికీ సమానత్వం పాటిస్తూ సేవ చేస్తానని ప్రమాణం చేశారు. చాలా చోట్ల కొత్తగా ఎన్నికైన సర్పంచులు తమ బంధుమిత్రులను, పార్టీల నాయకులను ఆహ్వానించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులను అత్యంత ఘనంగా సత్కరించారు. పలుచోట్ల పార్టీలపరంగా మరికొన్ని చోట్ల ఇండిపెండెంట్గా విజయం సాధించిన సర్పంచులు తమ ప్రాబల్యాన్ని చాటుకునే విధంగా ప్రమాణ స్వీకార వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.