17-09-2025 12:00:00 AM
తనిఖీలను గోప్యంగా ఉంచిన పోలీసులు
వైజాగ్‌లో పట్టుబడిన ఉగ్రవాదుల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొత్తగూడెంకు చెందిన యువకుడి ఫొటోలు!
ఉగ్రవాది పోస్టింగుకు బాలుడి లైక్‌లు?
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మంగళవారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ (ఎన్‌ఐఏ) అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్‌లో పట్టుబడిన ఉగ్రవాదుల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొత్తగూడెంకు చెందిన యువకుడి ఫొటోలు ఉండటంతో ఎన్‌ఐఏ అధికారులు సుమారు పది వాహనాల్లో బస్టాండ్ సమీపంలోని ఒక ఇంటిని తెల్లవారుజామున చుట్టుముట్టినట్లు సమాచారం.
ఉదయం 10 గంటల వరకు ఆ ప్రాంతాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అకస్మిక తనిఖీలతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు మాత్రం ఎన్‌ఐఏ అధికారుల తనిఖీలను ధ్రువీకరించడం లేదు.
తనిఖీల్లో కొత్తగూడానికి చెందిన ఓ బాలుడు ఉగ్రవాది పోస్టింగుకు పలుమార్లు లైక్ చేసినట్లు తెలిసింది. మైనర్ కావడంతో ఎన్‌ఐఏ అధికారులు హెచ్చరించి వెళ్లినట్లు సమాచారం. అయితే తనిఖీల్లో ఎలాంటి ఆధారాలు లభించాయి, ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా అనే సమాచారం తెలియాల్సి ఉంది.