14-10-2025 01:02:53 AM
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణలో అలసత్వం వహించవద్దని, విద్యా బోధన, వసతి సౌకర్యాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆయా శాఖల అధికారులను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు, గురుకులాల ఆర్ సి ఓ లు, డి సి ఓ లు, విద్య స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వసతి గృహాల్లో మండల ప్రత్యేక అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహించి హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, శానిటేషన్ తదితర అంశాలపై నివేదిక ఇవ్వాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. వివిధ శాఖల అధికారులతో జిల్లాలో గుడుంబా, డ్రగ్స్, మాలికద్రవ్యాల నిర్మూలనకు అవసరమైన చర్యలపై సమీక్ష నిర్వహించారు.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో ఉంటూ నిత్యం పరిస్థితిని సమీక్షించి, చెరువులు, కుంటలు, వాగుల వరద ఉధృతిని అంచనా వేస్తూ, ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.